రోటీన్ కు భిన్నం ఈసారి కేసీఆర్ ప్రోగ్రాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 5:12 AM GMT
రోటీన్ కు భిన్నం ఈసారి కేసీఆర్ ప్రోగ్రాం

సాధారణంగా ముఖ్యమంత్రి పాల్గొనే ప్రోగ్రాం అన్నంతనే భారీగా ఏర్పాట్లు సాగుతుంటాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూస్తారు. అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం కూర్చునేందుకు భారీ వేదికను ఏర్పాటు చేయటంతో పాటు.. పెద్ద ఎత్తున కుర్చీలు.. మైకు.. సౌండ్ సిస్టం.. ఏసీ సౌకర్యంతో పాటు.. ఇసుమంత అసౌకర్యం జరగకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా కేసీఆర్ నర్సాపూర్ ప్రోగ్రాం సాగిందని చెప్పాలి.

సభా వేదిక అన్నది లేకుండా.. కలపతో నిర్మించిన బ్రిడ్జి పైన ముఖ్యమంత్రితో సహా మంత్రులకు.. అధికారులకు కుర్చీలు వేశారు. వచ్చిన వారందరికి కుర్చీలు వేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో.. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ సైతం చెట్టు చుట్టూ ఏర్పాటు చేసిన గద్దె మీద కూర్చోవాల్సి వచ్చింది. సాధారణంగా సీఎం ఎక్కడ కూర్చుంటారో.. అక్కడ ఏసీ లాంటి ఏర్పాటు చేస్తారు. చెమట అన్నది లేకుండా చూసుకుంటారు. చిన్నపాటి అసౌకర్యానికి అస్కారం ఇవ్వరు. కానీ.. తాజా ప్రోగ్రాం మాత్రం అందుకు భిన్నంగా సాగింది.

ఏసీ.. కూలర్ సంగతి తర్వాత ఫ్యాన్ కూడా లేని పరిస్థితి. దీంతో.. ఎండ కారణంగా ఉక్కుపోతకు గురయ్యారు. ఈ కారణంతోనే చేతిలో ఉన్న పేపర్లతో విసురుకోవటం కనిపించింది. నేతలతో పాటు మీడియా ప్రతినిధులు సైతం పార్కులో నిర్మించిన మెట్ల మీదనే కూర్చోవాల్సి వచ్చింది. రెగ్యులర్ ప్రోగ్రాంకు భిన్నంగా సాగిన తాజా హరితహారం ప్రోగ్రాం.. మీడియా ప్రతినిధులకే కాదు.. నేతలకు.. అధికారులకు మర్చిపోలేని సరికొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ అందరి ముఖ్యమంత్రుల లాంటి అధినేత కాదన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. ‌

Next Story