మోదీతో డిసెంబర్ 3న కేసీఆర్ భేటీ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Nov 2019 6:29 AM GMT
మోదీతో డిసెంబర్ 3న కేసీఆర్ భేటీ?

ఆర్టీసీ సమస్యను పరిష్కరించిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక కేంద్రం వైపు దృష్టి సారించారు. కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబట్టేందుకు, కోరాల్సినవి కోరేందుకు డిసెంబర్ 3న ఢిల్లీకి ఆయన వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంతో పలు అంశాలు చర్చించనున్నట్టు ఆయన విలేఖరులకు తెలియచేశారు.

ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనే కే సీ ఆర్ తన ఢిల్లీ పర్యటన ప్లాన్ ను వెల్లడించారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు విషయంలో, జాతీయ రహదారుల మరమ్మత్తుల నిర్వహణ వ్యయాన్ని కేంద్రం భరించే విషయంలో ఆయన చర్చించనున్నారు. జాతీయ రహదారుల నిర్వహణలో కేంద్రం నిర్లక్ష్యాన్ని వహిస్తోందంటూ, రోడ్లను నిర్వహించేది ఇలా కాదని ఆయన ఆక్షేపించారు. ఇదే కాక రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న 27000 కిమీ స్టేట్ హై వేస్ మరమ్మత్తులను కూడా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీని కోసం తక్షణం రూ. 571 కోట్లు నాలుగు విడతలుగా మంజూరు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

అయితే వేర్వేరు పార్టీల నుంచి టీ ఆర్ ఎస్ లో చేరి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయిన వారిని బుజ్జగించేందుకు, పార్టీలో ఉండి, ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా పదవులు పొందలేని వారిని ఊరడించేందుకు కేసీఆర్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. వీరందరినీ వివిధ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించి, క్యాబినెట్ హోదా కల్పించాలన్నదే ఆ ప్రణాళిక సారాంశం. ఇందుకోసం నిబంధనలను సవరించాలని ఆయన భావిస్తు్న్నారు. కనీసం 27 గురు ఎమ్మెల్యేలకు చైర్మన్ల పదవులు కట్టబెట్టేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. రెవెన్యూ చట్టాన్ని కూడా త్వరలోనే సవరించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇక పుష్కలంగా వ్యవసాయ దిగుబడి ఉన్నందున రైతులు దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పాదనలను అమ్ముకోవచ్చునని, జీఎస్ టీ విధానం ఇందుకు సదుపాయం కల్పిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పత్తి, వరి, జొన్నల దిగుబడి చాలా బావుందని ఆయన తెలిపారు.

Next Story