కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. ‘రాజనీతి కాదు.. రణ నీతి’
By సుభాష్ Published on 20 Jun 2020 6:57 AM GMTమోడీ ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? ఎటకారం కాకుంటే ఏంది? అంటూ ప్రశ్నలు సంధించే వారు చాలామందే ఉంటారు. కానీ.. విషయాల్ని సునిశితంగా పరిశీలిస్తే ఇలాంటివి అర్థం కావటమే కాదు.. కొత్త కోణాలు కంటి ముందుకు వస్తాయి. గల్వాన్ లో చైనా దుర్మార్గంతో మన సైనికులు ఇరవై మంది వీర మరణం పొందటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది.
ఇందులో పలువురు పార్టీ అధినేతలు హాజరయ్యారు. మిగిలిన వారేం మాట్లాడారన్న విషయానికి సంబంధించిన సమాచారం కొంత ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్లుగా చెబుతున్న వాదన సంపూర్ణంగా ప్రజల ముందుకు వచ్చేసింది. వైరల్ గా మారిన ఈ సందేశం ఇప్పుడు కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేసేలా చేస్తుందని చెప్పాలి. జాతీయ.. అంతర్జాతీయ అంశాలు చోటు చేసుకున్నప్పుడు రాష్ట్రస్థాయి అధినేతల మాటలు సహజంగానే అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఆకట్టుకునేలా ఉండవు.
అందుకు భిన్నంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రసంగం ఆకట్టుకోవటమే కాదు.. దేశ ప్రజలు ఏ రీతిలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్న మార్గదర్శకం ఇచ్చేలా ఉందని చెప్పాలి. తన ప్రసంగ పాఠాన్ని సింఫుల్ గా ఒక్క లైనులో చెప్పేశారు కేసీఆర్. ఇప్పుడున్న వేళలో కావాల్సింది రాజనీతి కాదని.. రణ నీతి అని చెప్పటం ద్వారా.. తనను వ్యతిరేకించేవారి మనసుల్ని దోచేశారు.
భావోద్వేగంతో ఊగిపోవటం తెలివైన వారి లక్షణం కాదు. ఆవేశంతో చైనా వస్తువుల్ని బహిష్కరించాలన్న మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో సాధ్యమా? అన్న సూటిప్రశ్నకు ఎవరి నోటి నుంచి సమాధానం రాని పరిస్థితి. అలా అని.. ఎవరికి వారు చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలన్న బలమైన నిర్ణయాన్ని తీసుకుంటే.. ఇంట్లో ఉండే వస్తువుల్లో చాలాభాగం ఇంటి బయటకు పడేయాల్సి ఉంటుంది.
విన్నంతనే మనసు ఒప్పుకోకున్నా ఒక ముతక సామెతను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. చెరువు మీద అలిగితే నష్టం ఎవరికి? అన్న చందంగా చైనా వస్తువుల మీద ఆగ్రహం చూపిస్తే నష్టపోయేది మనమే. అలా అని చైనాను వెనకేసుకురావటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. చైనాను చీల్చి చెండాలాలి? అది కూడా.. వ్యూహాత్మకంగానే. మొదట్నించి శత్రువుగా ఉంటూనే.. అప్పుడప్పడు స్నేహహస్తాన్ని చాటే డ్రాగన్ కుటిల నీతి గురించి తెలీని భారతీయులు ఎవరు ఉండరు. ఉన్నట్లుండి భారత్ విషయంలో చైనా ఎందుకిలా? వ్యవహరిస్తుందన్నది చాలా కీలకం.
ఆ విషయాన్ని వదిలేసి.. దారుణానికి పాల్పడిన చైనాను చితక్కొట్టేయాలన్న ఆవేశపూరిత మాటలతో దేశానికి నష్టమే తప్పించి లాభం ఏ మాత్రం చేకూరదు. ఎందుకంటే.. మనల్ని రెచ్చగొట్టాలన్నదే డ్రాగన్ వ్యూహం. ఆ ఉచ్చులో పడకూడదన్న మాటను కేసీఆర్ చెప్పటమే కాదు.. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? చైనా ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలు ఏమిటి? వాటితో చైనా ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? ఆ వ్యతిరేకతను అధిగమించేందుకు భారత్ ను ముగ్గులోకి లాగి.. చైనీయులు జాతీయభావనలతో ఊగిపోయేలా చేసి.. తన పబ్బాన్ని గడుపుకోవటమే చైనా సర్కారు కుయుక్తి అన్న వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
కొమ్ములు తిరిగిన నేతలు మాత్రమే కాదు.. తల పండిన రాజకీయ కురువృద్ధులు ఇప్పుడేం చేయాలన్న మాటకు వెంటనే సమాధానం ఇవ్వని వేళ.. అందుకు భిన్నంగా ఈ మొత్తం ఎపిసోడ్ ను ఎలా చూడాలి? ఎలా చూస్తే ఏం లాభం జరుగుతుందన్న విషయాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పిన కేసీఆర్ తీరు చూస్తే.. మోడీకి మించి మార్కులు కొట్టేశారని చెప్పక తప్పదు.