పక్కా ప్లాన్‌ ప్రకారమే భారత్‌పై చైనా దాడి

By సుభాష్  Published on  18 Jun 2020 12:24 PM GMT
పక్కా ప్లాన్‌ ప్రకారమే భారత్‌పై చైనా దాడి

భారత్‌ - చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లోని గాల్వన్‌లోయలో భారత్‌- చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు అమరులు కాగా, చైనాకు చెందిన 43 జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారమే భారత్‌పై చైనా దాడి చేసిందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌-ఈతో అన్నారు. దీనిపై భారత్‌ నిరసనను చైనా మంత్రికి తెలియజేశారు. కాగా, సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల, అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారిద్దరూ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖకు ఇరువైపులా రెండు దేశాల సైనికులు వెనక్కి వెళ్లాలని రెండు దేశాల సైన్యానికి చెందిన సీనియర్‌ కమాండ్ల నడుమ జూన్‌ 6వ తేదీన జరిగిన సమావేశంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని భారత్‌ విదేశాంగ మంత్రి చైనా మంత్రికి గుర్తు చేశారు.

ఈ ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి కమాండర్లు గత వారం పలుమార్లు సమావేశమయ్యారు. ఆ దిశగా కొంత పురోగతి కూడా కనిపించింది. కానీ అంతలోనే వాస్తవాధీన రేఖకు ఇవతలి వైపు ఒక కట్టడాన్ని నిర్మించేందుకు చైనా ప్రయత్నించింది. అదే ఈ హింసాత్మక ఘటనకు కారణమైంది.. అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. అయితే జరిగిన తప్పంతా భారత్‌ పై నెట్టేసేందుకు చైనా విదేశాంగ మంత్రి ప్రయత్నించారు

రెండు దేశాల మధ్య సైనిక స్థాయి జరిగిన ఒప్పందాన్ని జూన్‌ 15న సాయంత్రం భారత సైన్యం ఉల్లంఘించిందని, గాల్వన్‌ లోయలో పరిస్థితి కుదుట పడే తరుణంలో వాస్తవాధీన రేఖను దాటారని ఆరోపించారు. గాల్వన్‌ లోయ ప్రాంతంపై ఎప్పటికీ సార్వభౌమాధికారం చైనాదే.. అంటూ ఆ దేశ విదేశాంగ ప్రతినిధులు తెలిపారు.

ఇక భారత్‌ - చైనా దేశాల మధ్య జరిగిన హింసాత్మక ఘటన నేపథ్‌యంలో చైనా పెద్ద ఎత్తున సరిహద్దు వెంబడి మోహరించిందని, ఏళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల్లో నిప్పు రాజేసిందని అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య వివాదాలు జరుగుతున్నాయని తెలిపింది.

Next Story
Share it