త్వరలో కేసీఆర్‌, జగన్‌ల భేటీ.. ఎందుకంటే..!

By సుభాష్  Published on  23 May 2020 1:50 AM GMT
త్వరలో కేసీఆర్‌, జగన్‌ల భేటీ.. ఎందుకంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌లు త్వరలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకచోటకు చేర్చి వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ అపెక్స్‌ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సభ్యులే.

కాగా, జనవరిలో జరిగిన ఓ సమావేశంలో రెండు రాష్ట్రాలు ఓ తేదీని ప్రకటించుకుని సీఎంల స్థాయిలో చర్చించాలని భావించాయి. ఆ రోజు చెప్పినట్లుగానే రెండు రాష్ట్రాలు త్వరగా తమ అజెండాను అందజేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది. ప్రస్తుతం తలెత్తిన జల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయి మాట్లాడుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఎన్జీటీ ఆదేశాల మేరకు శ్రీశైలం జలవిద్యుత్‌ను కూడా ఏపీ నిలిపివేసింది.

Next Story
Share it