స్నేహితుడు వేగంగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టగానే.. సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాడు..!

By అంజి  Published on  24 Feb 2020 10:51 AM GMT
స్నేహితుడు వేగంగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టగానే.. సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాడు..!

సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత అవసరమో నిరూపించే ఘటన ఇది..! కర్మాన్ ఘాట్ వద్ద కార్ యాక్సిడెంట్ జరుగగా అందులో ముగ్గురు యువకులు స్పాట్ లో చనిపోగా మాగంటి రామపద్మ కళ్యాణ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకు కారణం అతడు మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోవడం.

తన స్నేహితుడు మదుపాటి వినాయక మల్లికార్జున్ అతివేగంతో కారును నడపడం చూసిన కళ్యాణ్ వెంటనే సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాడు.. ఆ సమయంలో కళ్యాణ్ మద్యం మత్తులో ఉన్నా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలు నిలబడ్డాయని సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ జెనరల్ ఆసుపత్రికి ముగ్గురి మృతదేహాలను తరలించారు.. కళ్యాణ్ మాత్రం చిన్నపాటి దెబ్బలతో తప్పించుకున్నాడు. సడన్ జర్క్ లు వచ్చినప్పుడు సీట్ బెల్ట్ లలో ఉన్నటువంటి రిట్రాక్టర్ మెకానిజం అన్నది వ్యక్తిని ముందుకు వెళ్లనివ్వదని.. ప్రమాదాల సమయంలో అదే కాపాడుతుందని పోలీసు అధికారి స్పష్టం చేశారు. కారులోని మిగిలిన వ్యక్తులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండి ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని అన్నారు.

పెబ్బా సాయి నాథ్ అనే యువకుడు కూడా ఈ యాక్సిడెంట్ లో మరణించాడు. ఇంకో పది నిమిషాల్లో తాను ఇంటికి వస్తానని తల్లికి సాయి నాథ్ ఫోన్ చేసి చెప్పాడని తెలుస్తోంది. కొద్ది సేపటి తర్వాత యాక్సిడెంట్ జరిగిన విషయం అతడి తల్లికి తెలియడంతో ఆమె కుప్పకూలిపోయింది. సైదాబాద్ లోని సాయి నాథ్ ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది.

ఉదయం 3 గంటల సమయంలో వినాయక తల్లి మదుపాటి శ్యామలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేడం మీ పేరు మీద ఉన్న వాహనానికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. తర్వాత ఆమె తన సోదరుడు సంపత్ కుమార్ ను సంప్రదించింది. వారిరువురూ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే ఆమె కొడుకు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. వినాయక యాక్సెంచర్ లో టెకీగా ఉద్యోగం చేస్తున్నాడు. 2018 ఆగస్టులో అతడికి పెళ్లి అయింది. చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి.. చాలా మంచోడని సంపత్ తెలిపాడు.

దరావత్ శ్రీరామ్ నాయక్ కూడా ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు వదిలాడు. శ్రీరామ్ నాయక్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడి తండ్రి లచ్చిరామ్ నాయక్ శివరాత్రి పర్వదినాన పూజల కోసం ఉజ్జయిని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారని శ్రీరామ్ బంధువులు తెలిపారు.

Next Story