విషాదంలో సినీ పరిశ్రమ.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2020 9:16 AM GMT
కన్నడ సినీ పరిశ్రమలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు విజయ్ రెడ్డి(84) కన్నుమూశారు. అధిక వయస్సు రిత్యా ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన విజయ్ రెడ్డి.. 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు బి. విఠలచార్య దగ్గర ఆయన పనిచేశారు. అనంతరం కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1970లో రంగమహాల్ రహస్య చిత్రంతో దర్శకుడి మారిన ఆయనకు.. 1973లో రిలీజైన గాంధడ గుడితో గుర్తింపు వచ్చింది. గాంధడ గుడి సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయి గా చెప్తారు. అలాగే కన్నడ సినీమాలలో క్లాసిక్ మూవీగా పేరొందిన 'మయూరా' చిత్రాన్ని ఈయనే దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత వచ్చిన నా నిన్న బిదాలారే, , శ్రీనివాస కళ్యాణ, సనాడి అప్పన్న, కర్ణాటక సుపుత్ర చిత్రాల ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా విజయ్ రెడ్డి.. 1996లో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయ్ రెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.