యూటర్న్‌ తీసుకున్న కన్నా లక్ష్మీనారాయణ

By సుభాష్  Published on  13 Jan 2020 12:18 PM GMT
యూటర్న్‌ తీసుకున్న కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ యూటర్న్‌ తీసుకున్నారు. ఇటీవల ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాజధానులు ప్రకటించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో జగన్‌ సర్కార్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనను జగన్‌ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారని, అందుకే అమరావతి రాజధానినే కొనసాగించాలని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా.. ఆయనను అనుసరించే కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇదే సమయంగా భావించిన చంద్రబాబు రాజధాని అంశంపై ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రాజధానిని ఇక్కడి నుంచి తరలించే హక్కు ఎవరిచ్చారంటూ సీఎం జగన్‌పై కన్నా ధ్వజమెత్తారు.

రాజధానిని తరలిస్తే కేంద్రం ఊరుకోదు..

రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, రాజధాని ఏర్పాటుపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తున్నారు. ఇక ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కూడా రంగంలోకి దిగి రాఉధానులకు, కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదని, రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర పరిధిలోదని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీజేపీ కీలక నేతగా తాను చెప్పేదే ఫైనల్‌ అని అన్నారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ కూడా మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తాను చెప్పేదే ఫైనల్‌ అంటూ చెప్పారు.

రాజధానిపై కేంద్రం స్పందిస్తుంది

ఇక రాజధాని పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని, జగన్‌ తన ఇష్టం వచ్చినట్లు రాజధానులను మారిస్తే చూస్తూ ఊరుకోబోదని అన్నారు. ఈ విధంగా కన్నా వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపట్లోనే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రానే వచ్చింది. దీంతో ఎవరికి తెలియకుండా ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీరాగానే రాజధాని విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేసి యూటర్న్‌ వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్ణయానికి కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

తాను అలా అనలేదు

ఏపీ రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పలేదని, తన వ్యాఖ్యలు ఓ మీడియా వర్గం కావాలని సృష్టించిందని తెలిపారు. తనపై కావాలని లేనిపోనివి సృష్టిస్తున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణకు కేంద్రం పెద్దలు సరైన క్లాస్‌ ఇచ్చారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అనవసరంగా బీజేపీ తరపున వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలి తప్పా.. లేనిపోని వ్యాఖ్యలు చేయవద్దని క్లాస్‌ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా, మూడు రాజధానుల విషయంలో కూడా కేంద్రం పెద్దగా స్పందించినట్లు అనిపించడం లేదు. రాజధానిపై అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇందులో జోక్యం చేసుకోకుంటే మంచిదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. తనదైన శైలిలో అడుగులు వేస్తూ, ఏపీలోబలపేతం కావాలన్నదే బీజేపీ లక్ష్యం.

Next Story