టీటీడీ ఆస్తులు విక్రయించే హక్కు మీకు ఎక్కడిది.. కన్నా ఫైర్‌..

By సుభాష్  Published on  24 May 2020 10:08 AM GMT
టీటీడీ ఆస్తులు విక్రయించే హక్కు మీకు ఎక్కడిది.. కన్నా ఫైర్‌..

తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న 23 స్థిరాస్తులను వేలం వేయడాన్ని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తులను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వానికి హక్కు ఉందని, కాని దానిని విక్రయించే హక్కు ఏ మాత్రం లేదని కన్నా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

'టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది..? వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారు.? దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందని అనుమానం ఉంది. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది.' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

కాగా, తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారికి సంబంధించిన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఆ ఆస్తుల విలువ రూ. కోటి 50 లక్షల వరకు ఉంటుందని టీటీడీ గుర్తించింది. టెండర్ల ద్వారా పారదర్శకంగా ఈ విక్రయ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఏప్రిల్‌ 30 నుంచి కసరత్తు ప్రారంభించింది. విక్రయాల ద్వారా వంద కోట్ల వరకు సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. 2020-21 వార్షిక బడ్జెట్‌ సందర్బంగా దీనికి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించింది.



Next Story