కన్హయ్య కుమార్ కేసుపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
By సుభాష్ Published on 29 Feb 2020 1:43 PM IST
2016 ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌పై దేశ ద్రోహం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఢిల్లీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇక ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కన్హయ్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్‌లో త్వరితగతిన విచారణ జరగాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు.
కాగా, పార్లమెంట్‌పై దాడి చేసిన అప్జల్‌గురుకు 2016లో ఉరిశిక్ష అమలు చేసిన సమయంలో దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టులో కన్హయ్యకుమార్, జెఎన్‌యూ స్టూడెంట్ అనిర్‌బాన్ భట్టాచార్య, ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
గత ఏడాది జనవరి 14న తేదీన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలని రాత పూర్వకంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ సర్కార్ అనుమతి మంజూరు చేయడంతో పోలీసులకు లైన్ క్లియర్ అయినట్లయింది. ఫిబ్రవరి 19న పోలీసులు పంపిన అభ్యర్థనకు ఢిల్లీ సర్కార్ ఈ అనుమతిని మంజూరు చేసింది.