కంగనా రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పులు.. ఆమె ఏమంటోందంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2020 6:30 AM ISTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై కంగనా కూడా స్పందించారు. తనను బెదిరించడానికే ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె చెబుతూ ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కంగనా రనౌత్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఓ వర్గం కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించాడని ఆమె బలంగా వాదిస్తోంది. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ముంబై లోని మనాలీ ప్రాంతంలో ఉన్న కంగనా ఇంటి వద్ద ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని కంగనా తెలిపింది. ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని అనుమానించారు. కానీ అది కాదని తెలుస్తోంది. ఎనిమిది సెకన్ల వ్యవధిలో రెండు షాట్లను విన్నాననీ, తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీని కంగనా రనౌత్ కు పెంచారు అధికారులు.
ఏడు, ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ముంబైలో భయపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని కంగనా చెప్పుకొచ్చింది. సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని.. తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొడుకు గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగనా చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి కుమారుడిని ‘బేబీ పెంగ్విన్’ అని సంబోధిస్తూ కామెంట్లు చేసిన తరువాత రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం కొడుకును టార్గెట్ చేసినందుకు ఇక ముంబైలో తనను కష్టాలకు గురిచేస్తారని కొంతమంది తనతో చెప్పారని కూడా కంగనా తెలిపింది.
సుశాంత్ ఆత్మహత్యకు ముందు అతని ఇంట్లో పార్టీ జరిగిందని.. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసని.. పరోక్షంగా ఆదిత్యా థాక్రే పేరును కంగనా ప్రస్తావించింది. ఆయన కరణ్ జోహార్‌కు బెస్ట్ ఫ్రెండ్ అని, అందరూ ప్రేమగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారని తెలిపింది. ఒకవేళ తాను ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లుగా కనిపిస్తే... దాన్ని ఆత్మహత్యగా భావించకండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాల్పుల ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.