మరో అరుదైన ఘనతను సాధించిన కమలా హారిస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 7:31 AM GMTఅమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ కమలా హారిస్ నిలిచారు. డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు.
కాలిఫోర్నియా హై ప్రొఫైల్ సెనెటర్ అయిన కమలా హారిస్ పేరును ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఫియర్ లెస్ లేడీగా గుర్తింపు పొంది, దేశంలోని అద్భుతమైన ప్రజా సేవకుల్లో ఒకరైన కమలా హారిస్ పేరును తాను ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని బిడెన్ తెలిపారు. తన పేరును వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేయడం తనకు దక్కిన గౌరవమని కమలా హారిస్ అన్నారు. బిడెన్ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. అమెరికా ప్రజలను జో బిడెన్ ఒకే మాట, ఒకే బాటపై నడిపించగలరు. తన జీవితకాలం పాటు ఆయన అమెరికా కోసం శ్రమించారు. ఆయన అధ్యక్షుడైతే అమెరికా మరో మెట్టెక్కుతుందని కమలా హారిస్ ట్వీట్ చేశారు.
కమలా తల్లిదండ్రులు ఎన్నో దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వచ్చారు. తండ్రి జమైకన్ కాగా, తల్లి భారతీయురాలు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించింది. యూఎస్ సెనేట్ కు ఎన్నికైన తొలి సౌత్ ఆసియా దేశాల సంతతి కూడా ఆమే.
భారతీయ సంతతిరాలు కమలా హారిస్ వయసు 55 ఏళ్లు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో కమలా హారిస్ పుట్టింది. ఆమె తల్లి భారతీయురాలు. హోవర్డ్ యూనివర్సిటీలో ఆమె చదివింది. కలర్, బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా రాజకీయాల చేయకూడదని చెప్పే ఆమె.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆమె న్యాయపట్టా అందుకుంది. అలమేడా కౌంటీ జిల్లా అటార్నీ ఆఫీసులో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో జిల్లా అటార్నీగా ఉన్నత పదవిని అధిరోహించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా అమెరికా సంతతి మహిళగా కూడా కమలా హారిస్‌కు గుర్తింపు వచ్చింది.
కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు ఆమె అటార్నీ జనరల్‌గా చేశారు. డెమోక్రటిక్ పార్టీలో ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. ఆమె 2017లో కాలిఫోర్నియా జూనియర్ సేనేటర్‌గా పోటీ చేశారు.
గత ఏడాది ఆరంభంలో అధ్యక్ష అభ్యర్థి పోటీ కోసం ఆమె డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టినప్పటికీ.. హెల్త్‌కేర్ లాంటి కీలక అంశాల్లో ఆమె సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేకపోవడంతో ఆమె అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీకి సంపూర్ణ అర్హత సాధించలేకపోయారు. తాజగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్తిగా కమలా హారిస్‌ను డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ బైడెన్ ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలిస్తే 2024లో అమెరికా అధ్యక్ష పోటీలో కమలా నిలిచే అవకాశాలు ఉంటాయి. అమెరికాకు తదుపరి 2024లో జరిగి ఎన్నికల్లో లేదా 2028లో జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడటం ఖాయమంటున్నారు.