రిషబ్ పంత్ ఆటలో ఆ మార్పుకు కారణమేమిటో చెప్పిన కైఫ్
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 9:14 AM GMTమహేంద్రసింగ్ ధోని వారసుడిగా కీర్తి గడించాడు రిషబ్‌పంత్. ధోని లేని లోటును పూరించడమంటే మాటలు కాదు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ఆట తీరుతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మైదానంలో అతడి మెరుపులు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఎంతో ప్లస్ అయ్యాయి. ఇక భారత జట్టులో చోటు సంపాదించాక అతడి ఆట తీరులో నిలకడ లోపించింది.. ధోని స్థానంలో జట్టులోకి వచ్చానన్న భావన కూడా అతడిపై ఎంతో ఒత్తిడిని తీసుకుని వచ్చింది. దీంతో అతడిపై విమర్శలు కురిపించే వారు ఎక్కువయ్యారు. భారతజట్టులో కూడా స్థానం కోల్పోయాడు.
ఐపీఎల్ లో గత సీజన్లలో పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. పంత్ ఇంకా క్రీజులో ఉన్నాడంటే ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయానికి అవకాశాలు ఉన్నట్లేనని ప్రతి ఫ్రాంచైజీకి తెలుసు.
ఢిల్లీ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ కైఫ్ ఈ మధ్య మాట్లాడుతూ.. పంత్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడడానికి, భారత జట్టులో ఆడడానికి గల తేడా గురించి మాట్లాడాడు. ఒక్క విషయాన్ని పంత్ మిస్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు.
రిషబ్ పంత్ ఫ్రీ ఫ్లోయింగ్ క్రికెటర్ అని కైఫ్ తెలిపాడు. పంత్ కు ఒక సమయంలో బ్యాటింగ్ కు దింపాలి. ఆ బ్యాటింగ్ పొజిషన్ లో పంత్ దిగితే అందుకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. ఇన్ని ఓవర్లు నీకు ఉంటాయి అంటే అతడు తన సహజమైన ఆటతీరుతో అటాక్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. మొదటి బంతి నుండే అటాక్ చేయడం మొదలుపెడతాడని కైఫ్ చెప్పాడు. ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్ 'ఆకాష్ వాని' లో కైఫ్ మాట్లాడాడు.
'నేను, గంగూలీ, రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలా, నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలా అన్నది కొన్నిసార్లు చర్చించాం. కానీ పంత్ ను 60 బంతులు ఉన్నప్పుడు పంపితే మంచిదని భావించాం. ఏ బ్యాటింగ్ పొజిషన్ లో పంపాలి అన్నది మేము డిసైడ్ చేయలేదు. పంత్ చివరి పది ఓవర్లు ఏ బ్యాటింగ్ పొజిషన్ లో అయినా వెళ్లి ఆడగలిగేలా చేశాం. భారత జట్టులో ఇలాంటి అవకాశం పంత్ కు రాలేదు' అని కైఫ్ చెప్పాడు.
'కొన్ని కొన్ని సార్లు వన్డే మ్యాచ్ లలో 15వ ఓవర్లోనే బ్యాటింగ్ కు దిగాడు. ఓ ఫినిషర్ ఎప్పుడైనా అటాకింగ్ గేమ్ ఆడుతాడు. అతడిని అలాంటి పొజిషన్ లోనే ఉంచాడు. భారత జట్టులో పంత్ ఎక్కడ ఆడాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ ఐపీఎల్ లో తాము దాన్ని గుర్తించాం. అందుకే పంత్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించగలుగుతున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ లో ఎంతో స్వేచ్ఛగా ఆడుతూ ఉంటాడు కాబట్టే రాణించగలిగాడు' అని భారత జట్టు మాజీ క్రికెటర్ కైఫ్ తెలిపాడు. పంత్ మరోసారి ఐపీఎల్ లోనూ, దేశవాళీ క్రికెట్ లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరచి తిరిగి భారతజట్టులో స్థానం సంపాదిస్తాడో లేదో చూడాలి.