కరోనా తెచ్చిన కష్టం.. ట్రైనింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ద్యుతిచంద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 4:36 AM GMT
కరోనా తెచ్చిన కష్టం.. ట్రైనింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ద్యుతిచంద్

కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు జరగలేదు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ ను విధించాయి. దీంతో క్రీడాకారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన ట్రైనింగ్‌ కోసం బీఎండబ్ల్యూ కారు అమ్మాలని నిర్ణయించుకుంది భారత స్టార్‌ స్ర్పింటర్ ద్యుతిచంద్‌.

ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. కరోనా మహమమారి కారణంగా ఎవరు స్పాన్సర్‌ చేయడానికి ముందుకు రావడం లేదని, వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో బలింపిక్స్‌ కోసం ట్రైనింగ్‌ తీసుకోవాలని, అయితే.. ప్రస్తుతం అందుకు అవసరమైన డబ్బు తన దగ్గర లేదంది. అందుకే కారును అమ్మాలని అనుకుంటున్నానని ఎవరైనా కొనాలనుకుంటే మెసేంజర్‌లో సంప్రదించాలని అంటూ కారు ఫోటోలను పోస్టులో పెట్టారు. అయితే.. కాసేపటికే ఆ పోస్టును తొలగించారు.

ఓ జాతీయ మీడియాతో ద్యుతీ మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్‌తో పాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్‌నెస్‌, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్‌ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు.

Next Story