దాదా కష్టపడితే.. ధోని ప్రతిఫలం పొందాడు : గంభీర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 10:31 AM GMT
దాదా కష్టపడితే.. ధోని ప్రతిఫలం పొందాడు : గంభీర్

భారత క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన సారధులలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. భారత్‌కు రెండు ప్రపంచకప్‌(2007 టీ20, 2011 వన్డే) లు అందించడంతో పాటు ఐసీసీ చాంఫియన్స్‌ను టోప్రిని(2013లో) భారత జట్టు అతడి నాయకత్వంలోనే సొంతం చేసుకుంది. ధోని అంతలా సక్సెస్‌ కావడానికి కారణం భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీనే అని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ చెప్పాడు.

తాజాగా.. ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'భారత్ జట్టు ఫిక్సింగ్‌లో కూరుకుపోయిన తరుణంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. సీనియర్లకు అండగా నిలుస్తూ.. జూనియర్లను ఎంకరేజ్‌ చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చాడు. యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లను భారత జట్టుకు అందించాడు. బలమైన జట్టును తయారు చేయడానికి సౌరవ్‌ ఎంతో కష్టపడ్డాడు. దాదా కష్టంతోనే ధోనికి ప్రతిఫలాలందాయని' గౌతి చెప్పుకొచ్చాడు.

టెస్టు క్రికెట్‌లో ధోని విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడంటే.. అందుకు జహీర్‌ ఖాన్‌ కారణం. ధోని అదృష్టం అది. అందుకే ఆ గొప్పతనం అంతా గంగూలీకే చెందుతుంది. నా దృష్టిలో టీమ్ఇండియా తరుపున అత్యుత్తమ ప్రపంచస్థాయి బౌలర్‌ జహీర్‌ ఖానే. ప్రతి ఫార్మాట్‌లోనూ అతడు అద్భుతాలు చేశాడు. టెస్టు కెరీర్‌లో 311 వికెట్లు పడగొట్టగా.. గంగూలీ కెప్టెన్సీలో 35.98 సగటుతో 102, ధోని నాయకత్వంలో 30.62 సగటుతో 116 వికెట్లు తీశాడని అన్నాడు.

సచిన్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, విరాట్‌తోపాటు నేను జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్‌కప్‌లో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే, ఇలాంటి వారిని తయారు చేయడానికి దాదా ఎంతో కష్టపడ్డాడని అన్నాడు. గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడని అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Next Story