ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 209 కేసుల్ని పరిష్కరించిన హైదరాబాద్ పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 7:55 AM GMT
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 209 కేసుల్ని పరిష్కరించిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో, జన సమర్థమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చితే మాత్రం సరిపోదు. దృశ్యాలు వాటిలో స్పష్టంగా రికార్డయ్యేట్టుగా కూడా చూసుకోవాలి. ఏవైనా నేరాలు జరిగినప్పుడు నిందితుల చిత్రాలు, దృశ్యాలు, నేర దృశ్యాలు స్పష్టంగా రికార్డయితేనే సత్వరం కేసు పరిష్కారమవుతుంది. కానీ చాలా సందర్భాల్లో ఈ సీసీటీవీ వీడియో ఫుటేజ్ క్లియర్‌గా ఉండదు.

అలాంటప్పుడు దానికి పరిష్కారం కనుగొనేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ టూల్స్ ని ఉపయోగించి ముందుకు వెళ్లాల్సుంటుంది. 2015లో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు, హత్యలు లాంటి అనేక కీలకమైన కేసులను పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు.

ఇలా కెమెరాల్లో రికార్డయ్యే దృశ్యాల్లో స్పష్టతను పెంచే సాంకేతిక పరిజ్ఞానం కేసుల పరిష్కారంలో కీలకంగా మారిందని నల్గొండ జిల్లా పోలీస్ ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ సి.హెచ్.సురేష్ చెబుతున్నారు. నిజానికి పోలీస్ వ్యవస్థలో చాలా జిల్లాల్లో దీనికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు.

అందువల్ల వాటిని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి పంపించి అక్కడి సిబ్బంది సాయంతో కేసు విచారణలో పురోగతి సాధిస్తారు. అది మాత్రమే కాక ఎక్కువశాతం నేరాలు పట్టణాలు, నగరాల్లోనే జరుగుతాయి. దీనివల్ల పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛందంగా ప్రైవేట్ వ్యాపారులు, దుకాణాల యజమానులుకూడా ఇప్పుడు సీసీ టీవీలను అమర్చుకుని దృశ్యాలను రికార్డ్ చేయడం మొదలుపెట్టారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఐకెనా ఫోరెన్సిక్, క్లియర్ ఐడి లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో దృశ్యాల, చిత్రాల నాణ్యతను పెంచి దగ్గరగా, స్పష్టంగా చూసే వీలుంటుంది.

హైదరాబాద్ కు చెందిన పోలీస్ విభాగం వీడియో అనాలసిస్ టీమ్ లో పనిచేస్తున్న బండమీద సన్నీ చెబుతున్న వివరాల ప్రకారం కేవలం వీడియో దృశ్యాల నాణ్యతను పెంచడంతోనే పని పూర్తికాదు. వాటినుంచి సేకరించిన చిత్రాలను డాటాబేస్ లోకి ఇంపోర్ట్ చేసుకుని మాన్యువల్ గా వెరిఫై చేయాల్సుంటుంది.

సంబంధిత అధికారి వీడియో ఫుటేజ్‌ని తీసుకొచ్చినప్పుడు దాన్ని వీళ్ల దగ్గర ఉన్న సాఫ్ట్ వేర్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటారు. దీనిలో రిజొల్యూషన్, కంపాక్ట్ లాంటి అనేక విధాలైన టూల్స్ ఉంటాయి. ఇలా ఆ ఫుటేజ్ నుంచి చిత్రాలను సేకరించిన తర్వాత, వాటి నాణ్యతను పెంచిన తర్వాత మూలంతో పోల్చి చూసినప్పుడు అచ్చుగుద్దినట్టుగా పోలికలు సరిపోవాలి.

ఫేషియల్ రికగ్నైజేషన్ యూనిట్ అనే మరొక సాఫ్ట్ వేర్ ఆధారంగా మొత్తం డేటాబేస్ తో ముఖాల్ని పోల్చి చూస్తారు. ఈ డేటాబేస్ లో దాదాపుగా లక్షకుపైగా పాతనేరగాళ్లు, కనిపించకుండాపోయినవాళ్ల చిత్రాలుంటాయి.

సీక్వెన్షియల్ క్వైరీ లాంగ్వేజ్ అనే మరో సాఫ్ట్ వేర్ ద్వారా ఉన్న ఫోటోలతో నాణ్యతను పెంచి తయారుచేసిన ఫోటోలను పోల్చి చూడడం సులభం. దీనిలో 50 శాతం కంటే ఎక్కువగా దగ్గరి పోలికలు ఉన్న చిత్రాలన్నింటినీ సాఫ్ట్ వేర్ డిస్ ప్లే చేస్తుంది. డేటాబేస్ లో ఉన్న ఫోటోలతో ఈ పోటోలను పోల్చి మాన్యువల్ గా గుర్తించే ప్రయత్నం చేస్తారు పోలీస్ సిబ్బంది. ఇలా చేయడానికి ఇంటర్ నెట్ సాయంకూడా అవసరం ఉండదు.

ఈ విధంగా చిత్రాలను సరిపోల్చడంద్వారా చాలా కేసుల్లో విచారణ ముందుకు సాగుతుంది. అలాగే వాహనాలు రిజిస్ట్రేషన్ నెంబర్లనుకూడా డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తారు. వాటినికూడా ఇలాగే సరిపోల్చి చూసి అనేక కేసులను సాల్వ్ చేశారు.

నోట్ల రద్దు సమయంలో ఒక వ్యక్తి తుపాకీతో బ్యాంక్ మేనేజర్ ని కాల్చేశాడు. ఆ నిందితుడు నల్ల రంగు యాక్టివామీద పారిపోయాడు. ఆ సమయంలో నెంబర్ ప్లేట్ మీద ఉన్న ఆఖరి నాలుగు అక్షరాలు మాత్రం కనిపించాయి. అప్పుడు ఆర్టీయే ఎస్.క్యూ.ఎల్ డాటాబేస్ లో ఆ నెంబర్ ని ఎంటర్ చేశారు. అప్పుడు దాదాపు 70 నుంచి 80 వరకూ అనుమానితుల జాబితా సిద్ధమయ్యింది వాటి యజమానుల ఫోన్ నెంబర్లతో సహా. ఆ ఫోన్ నెంబర్లను ఆధారం చేసుకుని ఫేస్ బుక్ లో సెర్చ్ చేసినప్పుడు నిందితుడిని తను వేసుకున్న బట్టల ఆధారంగా గుర్తించగలిగారు.

సంవత్సరం నమోదైన కేసుల వివరాలు

(హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్)

పరిష్కారం అయిన కేసులు
2015213140
2016278253
2017312282
2018417277
2019367209

పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలనుంచి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు ఇలాంటి ఫుటేజ్‌లు అందాయి. అక్టోబర్ 2019 నాటికి 367 కేసులకుగానూ 209 కేసుల్ని ఇలా వీడియో ఫుటేజ్‌ల నాణ్యతను మెరుగుపరచి పోల్చి చూడడం ద్వారా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఐటీ సిబ్బంది పరిష్కరించడం విశేషం.

చాలా సందర్భాల్లో సీసీటీవీలను అమర్చిన కోణాలు సరిగా ఉండవు. అలాగే లైటింగ్ కూడా సరిపోదు. అలాంటి సందర్భాల్లో వీడియో దృశ్యాలు, ఫోటోలు డల్ గా ఉంటాయి. వాటి నాణ్యతను మెరుగుపరచగలిగితే ఎన్నో కేసుల్లో పరిష్కారం దొరుకుతుంది. నిందితులను పట్టుకోవడం సాధ్యమవుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బ్లర్ ఇమేజ్ లను, దృశ్యాలను కూడా నాణ్యత పెంచి ఎక్కువ రిజొల్యూషన్ ఉన్న చిత్రాలు, దృశ్యాలుగా మార్చే అవకాశం ఉంటుందంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఐటీ విభాగం సిబ్బంది.

Next Story
Share it