భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే..!- ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 9:20 AM GMT
భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే..!- ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

భారత్ కు అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా రూపంలో గొప్ప మిత్రుడు దొరికాడు. భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ చెప్పారు. సైనిక, ఆర్ధిక, జనాభా పరంగా చూసిన శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌కు అర్హత ఉందన్నారు. మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలని టోని అభిప్రాయపడ్డారు . మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా ఎవరికి ఇవ్వాలని అడిగితే తానూ ఇండియాకే ఓటేస్తానన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండో - పసిఫిక్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్సెప్‌ నుంచి ఇండియా దూరంగా ఉండటాన్ని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని సమర్ధించారు. భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఆవిర్భవించబోతుందని చెప్పారు. చైనా అభివృద్ధిని భారత్ దాటనుందన్నారు. అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌కు అన్ని విధాలా ప్రపంచదేశాలు సాయంగా ఉండాలని పిలుపునిచ్చారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.

భారత్ ఎప్పటి నుంచో ఐక్య రాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఫైట్ చేస్తుంది. 1950 దశకంలోనే శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పేరును అమెరికా ప్రతిపాదించింది. అయితే..ప్రధాని నెహ్రూ వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఇండియాకు వచ్చిన ఆఫర్‌ను ఆయన చైనాకు ఇచ్చాడు. ఇప్పుడు చైనా ఇండియాకు సంబంధించిన ప్రతిదాన్ని వీటో చేస్తుంది. పాక్‌లో ఉండే జైషే మహ్మద్ టెర్రర్‌ గ్రూప్‌ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో వీటోతో పలుసార్లు చైనా అడ్డుపడింది. తనకున్న అమూల్యమైన హక్కును లోక కల్యాణానికి కాకుండా...ఉగ్రవాదులను రక్షించడానికి, వారికి ఆశ్రయమిచ్చే దేశాన్ని కాపాడటానికి చైనా తన వీటో హక్కును వాడుకుంటుంది. చైనాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి అది ప్రజాస్వామ్య దేశం కూడా కాదు.

ప్రస్తుతం ఐక్య రాజ్యసమితిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్, చైనాలు శాశ్వత సభ్య దేశాలు . వీటికి వీటో అధికారం కూడా ఉంది. కాని..వీటోను ఆయా దేశాలు అంతర్జాతీయ ప్రయోజనాలు కోసం కాకుండా..స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి.

ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలు, 2 అబ్జర్వ్ దేశాలు ఉన్నాయి. జూన్ 26, 1945 యూఎన్‌ఓ చార్టర్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక సమస్యలను పరిష్కరించింది. ఆఫ్రికా దేశాల్లో ఆశాంతిని తగ్గించింది. అనేక దేశాల్లో ఆకలి మంటలు తగ్గించింది. ఐక్యరాజ్య సమితి శాంతిదళం అనేక దేశాల్లో అసాంఘిక శక్తులను అణచివేసింది. కాని...ప్రస్తుతం ఐక్య రాజ్యసమితి నిధుల లేమితో అల్లాడుతుంది. ధనిక దేశాలే చాలా వరకు యూఎన్‌ఓకు బాకీ ఉన్నాయి. ఫండ్స్‌ సరిగా ఇవ్వకపోవడంతో యూఎన్‌ఓ అనే క కార్యాలయాలు విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని స్థితి.

ఇప్పటికైనా అగ్రదేశాల నేతలు, ప్రపంచ దేశాలు పారదర్శకంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్య దేశాలకు పెద్ద పీట వేయాలి. వసుదైక కుటుంబం గురించి ఆలోచించే భారత్ లాంటి దేశాలకు శాశ్వత సభ్యత్వంతోపాటు, వీటో అధికారం ఇవ్వాలి.

వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్‌

Next Story