ముక్కలు ముక్కలుగా శ‌రీర భాగాలు.. సంచలన హత్య కేసును చేధించిన రాజస్థాన్ పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 1:34 PM GMT
ముక్కలు ముక్కలుగా శ‌రీర భాగాలు.. సంచలన హత్య కేసును చేధించిన రాజస్థాన్ పోలీసులు

జోధ్ పూర్: రాజస్థాన్ పోలీసులు ఓ సంచలన హత్యను చేధించారు. ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపి ఆ కేసును పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఇంతకూ ఈ దారుణం వెనుక ఉన్నది ఎవరో తెలుసా..? పెళ్ళామే..! తన అక్కాచెల్లెళ్లతో కలిసి భర్తనే దారుణంగా హత్య చేసింది. పోలీసులు 48 గంటల్లో ఈ సంచలన హత్యను చేధించారు.

ఓ వ్యక్తి శరీర భాగాలు డ్రైనేజ్ లో రావడాన్ని గుర్తించారు. నందాడి సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ సమీపంలోని మురికి కాలువలో రెండు బాక్సులను బుధవారం స్థానికులు గుర్తించారు. వాటిని పరీక్షించి చూడగా అందులో మనిషి మాంసం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి పరిశీలించారు. ఈ కేసును ఛేదించాలనే ఉద్దేశ్యంతో పోలీసులు పలు టీమ్ లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ అయిన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో స్థానికంగా నివసించే సుశీల్‌ అలియాస్‌ చరణ్‌ సింగ్‌ కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి దగ్గరలోనే పోలీసులకు అతడి బైక్ కూడా లభించింది.

పోలీసుల విచారణలో ఇద్దరు మహిళలు బైక్ ను పార్క్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు అతడి భార్తను, మరదళ్ళను విచారించారు. విచారణలో తానే భర్తను చంపినట్లు సుశీల్‌ భార్య సీమా పోలీసులతో నేరాన్ని అంగీకరించింది. తన అక్కాచెల్లెళ్లు, ఫ్రెండ్‌ సాయంతో సుశీల్‌ను తమ ఇంట్లోనే చంపామని.. అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లో పడవేసినట్లు తెలిపింది.ఈ ఘటనలో నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి అయి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే హత్య జరిగింది. మరీ ఇంత కిరాతకంగా ఎలా చంపగలిగారోనని అందరూ షాక్ తిన్నారు. సీమాకు మరో మహిళతో సంబంధం ఉందని విచారణలో తేలింది. అది తప్పని చెప్పినందుకే ఈ హత్య జరిగిందని భావిస్తూ ఉన్నారు. మరిన్ని విషయాలపై పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు.

Next Story
Share it