నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
TS GOVT issues order on extending age limit.తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాలకు
By తోట వంశీ కుమార్ Published on 20 March 2022 8:14 AM ISTతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లకు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసు 44 ఏళ్లకు పెరిగింది. తాజాగా సడలించిన గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంది. ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లుగా ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉంది. తాజా పెంపుతో ఓసీలు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 49 ఏళ్లు, దివ్యాంగులు 54 ఏళ్ల వరకు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ పెంపు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు వర్తిస్తుందని తెలిపింది.
రాష్ట్రంలో 80వేల పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే వయో పరిమితిని కూడా పెంచుతామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనశాఖ వయో పరిమితి పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించింది. అన్నీ నోటిఫికేషన్లు ఒకే సారి కాకుండా ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశల వారీగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగార్థులకు తగిన సమయం ఇస్తూ పరీక్షలను నిర్వహించనుంది. ఇక ఏ క్షణంలోనైనా ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.