ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 240 మందికి షాకిచ్చింది. శిక్షణ కాలంలో నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయారనే కారణంతో 240 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఏప్రిల్ 18న ఆ ఉద్యోగులు ఈమెయిల్ అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దాదాపు 300 మందికి పైగా ట్రైనీలను ఇదే కారణంతో తొలగించింది ఇన్ఫోసిస్. 'జనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'లో అర్హత ప్రమాణాలను ఈ ఉద్యోగులు అందుకోలేకపోవడం తో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగం కోల్పోయిన ట్రైనీలకు కంపెనీ ఒక నెల వేతనాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించనుంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్, ఉద్యోగాన్వేషణలో సహాయపడేందుకు ప్రొఫెషనల్ ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలను అందించనుంది. ఎన్‌ఐఐటీ, అప్‌గ్రాడ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ అందించనున్నారు. ఇక మైసూర్‌లోని శిక్షణా కేంద్రం నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యంతో పాటు, వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా అందించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.