అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకువచ్చిన నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. యూనిఫాం సర్వీసెస్ లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్ లో గ్రేడ్-3 కోచ్ ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో నూతన క్రీడా పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని అన్ని ఆటలను ప్రోత్సహించాలని అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని… ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు.