గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి నిర్ణయం
రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి ఈ విభాగంలో 358 మంది వైద్యులు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat
రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి ఈ విభాగంలో 358 మంది వైద్యులు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 71 మంది డాక్టర్లు, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు మొత్తం 358 మందిని సత్వరమే నియమించడానికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఆయుష్ సేవలపై కేలవం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీనికి భిన్నంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో 2024-25 సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం రూ.83 కోట్లు మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన స్టేట్ యానువల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆయుష్ మిషన్ కింద రూ.250 కోట్ల మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ స్థాయిలో ఆయుష్ సేవల విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో సిబ్బంది కొరతపై మంత్రి సమీక్షించి, తక్షణమే 358 పోస్టుల్ని భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆయుష్ సేవల్ని అందించేందుకు 71 మంది డాక్టర్లను, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజర్లను, వారికి సహాయక సిబ్బందిని, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు ఇతర సిబ్బందిని నియమించనున్నారు. వీరిని కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రాష్ట్ర వైద్య సేవల నియామకాల మండలి ద్వారా ఎంపిక చేస్తారు. మద్యానికి బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముగ్గురు సైక్రియాట్రిస్టుల్ని కూడా నియమిస్తారు.