బైజూస్ సంస్థ మరోసారి ఉద్యోగులను తొలగించాలని ఫిక్స్ అయింది. 500 మంది ఉద్యోగులను తాజా రౌండ్‌లో తొలగించే ప్రక్రియను ప్రారంభించిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఉద్యోగులకు తీసివేయడం గురించి ఫోన్‌లో తెలియజేస్తున్నారు. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగినంత డబ్బును పొందడం కోసం కంపెనీ కష్టపడుతూ ఉన్న సమయంలో ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలను చేస్తున్నారు.
తొలగించిన ఉద్యోగులలో వారిలో దాదాపు 240 మంది బైజూస్ ట్యూషన్ సెంటర్ కార్యకలాపాలలో పనిచేస్తున్నారు. బైజూస్ వద్ద తగినంత డబ్బు లేనందున తొలగింపులు జరుగుతూ ఉన్నాయని.. ఎనిమిది వారాల వ్యవధిలో తక్కువ ఉత్పాదకత కలిగిన ఉద్యోగులను ఎంపిక చేయాల్సి వచ్చిందని కంపెనీకి చెందిన ఒక మేనేజర్ తెలిపారు. అక్టోబర్ 2023లో ప్రకటించిన వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా చివరి దశలో ఉన్నాము, నిర్వహణను సులభతరం చేయడానికి, వ్యయాలని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.