TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By - అంజి |
TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి.
డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల వయస్సున్న వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అయితే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రం కుల ధ్రువీకరణ పత్రాలు.. ఎస్సీ వర్గీకరణ ప్రకారం (గ్రేడ్-1,2,3) కొత్త ఫార్మాట్‌లో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా సర్టిఫికెట్ రాని అభ్యర్థులు.. తమ వద్ద ఉన్న పాత ఎస్సీ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు.
ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఎస్సీ వర్గీకరణ కొత్త ఫార్మాట్ పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి పర్యవేక్షణలో ఈ నియామకాలు జరుగుతాయి. డ్రైవర్ ఉద్యోగాలకు జీతం నెలకు రూ.29,960 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో శ్రామిక్ పోస్టులకు నెలకు జీతం రూ.16,550 నుంచి రూ.45,030 వరకు ఉంటుందని పేర్కొన్నారు.