అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్ -2 పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్‌షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
By అంజి Published on 26 Nov 2024 6:40 AM ISTఅభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
హైదరాబాద్: వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్ -2 పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్‌షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న జరిగే ఆర్‌ఆర్‌బీ పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 3,600 మంది రాస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. డిసెంబరు 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -3 నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 జరగనుంది. పరీక్ష ప్రారంభం అయ్యే సమయం కంటే 30 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు.
ఉదయం నిర్వహించే పరీక్షకు ఉదయం 9.30 గంటలు తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్షకు 2.30 గంటల తరవాత అభ్యర్థులెవరనీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తారు. పేపర్-1 పరీక్ష రాసిన హాల్ టికెట్‌తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలి. హాల్ టికెట్, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరచుకోవాలి. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు కాల్ చేయాలి. లేదా Helpdesk@tspsc.gov.in చిరునామాకు ఈ-మెయిల్ చేసిన సరిపోతుంది.