నాని 'జెర్సీ' కి అరుదైన గౌరవం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2020 8:12 AM ISTగౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన సినిమా 'జెర్సీ' గొప్ప విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హృదయాలను హత్తుకునే మంచి సబ్జెక్టు తో గౌతమ్ తిన్న నూరి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..!
ఈ సినిమాకు తాజాగా అపురూపమైన ఘనత దక్కించుకుంది. 'జెర్సీ' చిత్రం ఓ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతోంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది.
'జెర్సీ' చిత్రమే కాకుండా, 'సూపర్ 30', కార్తీ నటించిన 'ఖైదీ' (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.
తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలో బెస్ట్ గా 'జెర్సీ' సినిమా నిలిచింది. అర్జున్ తన ఆశలు, ఆశయాలన్నిటినీ తన గర్ల్ ఫ్రెండ్ సారా కోసం వదిలేస్తాడు. తన కొడుకు నాని ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ బర్త్ డే గిఫ్ట్ గా కోరుకోవడంతో చోటు చేసుకున్న ఘటనల ద్వారా అర్జున్ 36 సంవత్సరాల వయసులో మళ్ళీ బ్యాటు పడతాడు.. తన కొడుకు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించాలని అనుకుంటూ చేసే అద్భుతమైన ప్రయాణమే జెర్సీ సినిమా..! శ్రద్ధా శ్రీనాథ్ భార్య పాత్రలో మెప్పించగా, సత్య రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ గా నిలిచింది.
బాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమా రీమేక్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. షాహిద్ కపూర్ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో షాహిద్ కపూర్ గాయపడ్డాడు. ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.