రియా చక్రవర్తి.. సుపారీ కిల్లర్, విషకన్య : జేడీయూ నేత సంచలన వ్యాఖ్యలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 12:55 PM ISTదివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్, సుశాంత్ గర్ల్‌ప్రెండ్ రియా చక్రవర్తిపై జేడీయూ నేత మహేశ్వర్ హజారీ సంచలన ఆరోపణలు చేశారు. హీరోగా తనదైన నటనతో బాలీవుడ్‌లో అనతికాలంలోనే గుర్తింపుపొందిన సుశాంత్ జూన్ 14వతేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుండి సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా జేడీయూ నేత మహేశ్వర్ హజారీ.. సుశాంత్ ప్రియురాలైన రియా చక్రవర్తి కాంట్రాక్టు హంతకి, విషకన్య అని.. అతడిని మోసగించిందని సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ ది హత్యేనని, దీని వెనుక ఓ పెద్ద ముఠా హస్తం ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మహేశ్వర్ హజారీ డిమాండ్ చేశారు.
రియా చక్రవర్తి.. సుశాంత్‌ను ప్రేమ పేరిట మోసగించి డబ్బు తీసుకొని పోయిందని మహేశ్వర్ ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారం సుశాంత్ ను రియా చక్రవర్తి చంపిందని, ఆమె విషకన్య అని విమర్శించారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని మహేశ్వర్ హజారీ డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే.. సుశాంత్ సింగ్ బిహార్‌లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. టీవీ సీరియల్స్ ద్వారా నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాంత్ సింగ్‌కు చాలా కలలు ఉన్నాయి. ఆ కలలే ఆయన్ను బాలీవుడ్‌కి చేర్చాయి. కై పో చే, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ భక్షి, ధోనీ, పీకే, కేదార్‌నాథ్, చిచ్చోరే వంటి చిత్రాలు ఆయనకు పేరుతెచ్చిపెట్టాయి. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ‘‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.