ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సృష్టిస్తున్న అల్ల‌క‌ల్లోలానికి బ్రేక్ వేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం నిన్న‌ జ‌న‌తా క‌ర్ఫ్యూ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డ కూడా వైర‌స్‌ విల‌య తాండ‌వం చేస్తుండ‌టంతో 8 రాష్ట్రాల‌లోని 75జిల్లాలో లాక్‌డౌన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎటువంటి ర‌వాణా ఉండ‌ద‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. కేవ‌లం నిత్య‌వ‌స‌రాలు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.

అయితే.. కర్ఫ్యూ అనంతరం ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఇళ్లలోకి కావాల్సిన పాలు, కూరగాయాలు, నిత్యావసర సరుకులు కొరకు ప్ర‌జ‌లు క్యూ క‌ట్టారు. రైతు బజార్లు, పెట్రోల్ బంకుల్లో కొనుగోలుదారులు భారీ కనిపిస్తున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల‌లో ఎటువంటి మార్పులు లేక‌పోగా.. కూరగాయల ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. హైద్రాబాద్ న‌గ‌రంలో కొన్ని రైతు బ‌జార్లకు వినియోగ‌దారులు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో.. ర‌ద్దీని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా ట‌మాట కేజీ రూ. 150, మిర్చి కిలో రూ. 100 అంటూ రేట్ల‌ను అమాంతం నింగికి చేర్చారు వ‌ర్త‌కులు.
ఇదిలావుంటే.. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం లాక్ డౌన్ చేయాల్సిన జాబితాలో తెలంగాణలో 5 జిల్లాలే ఉన్నప్పటికీ..సీఎం కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణను లాక్ డౌన్ చేస్తున్న సందర్భంగా తెల్లరేషన్ కార్డు దారులందరికీ 12 కిలోల బియ్యంతో పాటు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు రూ.1500 ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.