ముఖ్యాంశాలు

  • పేదలకు నెలకు సరిపడా రేషన్ ఫ్రీ
  • ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందే..

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం లాక్ డౌన్ చేయాల్సిన జాబితాలో తెలంగాణలో 5 జిల్లాలే ఉన్నప్పటికీ..సీఎం కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వారం రోజుల్లో ఎవ్వరూ బయట తిరగరాదని సూచించారు. నూటికి నూరు శాతం బస్సులు, ఆటోలు సహా మరేఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్టులు, ప్రైవేట్ వాహనాలు తిరగవని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణకు రావాల్సిన నిత్యావసర వస్తువులను చేరవేసే వాహనాలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్ఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితమవ్వాలని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో అత్యవసరంగా పనిచేయాల్సిన ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్, వైద్యం, పోలీసు రంగంలో ఉన్న ఉద్యోగులు మాత్రం 100 శాతం విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు దారులకు బియ్యం, రూ.1500

తెలంగాణను లాక్ డౌన్ చేస్తున్న సందర్భంగా తెల్లరేషన్ కార్డు దారులందరికీ 12 కిలోల బియ్యంతో పాటు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు రూ.1500 ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అలాగే ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, డైలీ లేబర్ కు, ఇతర కూలీలకు ఆయా యజమానులు ఈ వారంరోజుల జీతాన్ని చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. సెలవులిచ్చారు కదా అని ఎవరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయత్నాలు మాత్రం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలైన కూరగాయలు, పాలు, మెడిసిన్ మాత్రం అందుబాటులో ఉంటాయి. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా ఇంటికి ఒక మనిషి మాత్రమే వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెడితే ఇటలీకి పట్టిన గతే తెలంగాణకు కూడా పడుతుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ఈ వారంరోజుల్లోనూ డెలివరీలు చేయాల్సిన గర్భిణులకు కూడా సకాలంలో వైద్యం అందుతుందన్నారు. యాక్ట్ 1890 ప్రకారం ఇలాంటి విపత్తు సమయంలో అత్యవసరంగా గర్భిణులను ఆస్పత్రులకు తరలించాల్సి వస్తే ఎవరి వాహనాన్నైనా ఉపయోగించుకోవచ్చునని కేసీఆర్ తెలిపారు. మన స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అవుతుందని, కాదని ఇష్టమొచ్చినట్లు తిరిగితే మాత్రం కాపాడటం ఎవరితరం కాదన్నారు.

ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలందరికీ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటలకు వైద్యులకు కరతాల ధ్వనులతో అభినందనలు తెలిపిన వారందరినీ కేసీఆర్ ప్రశంసించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.