ఆ రెండు బిల్లులను వ్యతిరేకించండి.. రాపాకకు పవన్ లేఖ
By అంజి Published on 20 Jan 2020 6:23 AM GMTజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆపార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిలలో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని లేఖలో పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏపీ డీసెంట్రలైజ్ అండ్ ఈక్వల్ డెవలప్ మెంట్ రీజియన్స్ యాక్ట్ 2020, సీఆర్డీఏ రద్దు చేసి అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ 2020 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులను శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే సమయంలోను, ఓటింగ్‌లోనూ వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ రాపాకకు సూచించారు.
అయితే తాను వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు తెలుపుతానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇది వరకు తెలిపారు. అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటు వేస్తానన్నారు. జనసేన పార్టీ నుంచి కేవలం రాపాక మాత్రమే మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ జరిగే చర్చలో సైతం మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడతానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాపాక పేర్కొన్నారు.
ఇవాళ సాయంత్రం జనసేన పీఏసీ అత్యవసర సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది, బీజేపీతో కలిసి పని చేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.