బీజేపీ-జనసేన లాంగ్‌ మార్చ్‌కి బ్రేక్‌

By అంజి  Published on  25 Jan 2020 9:47 AM GMT
బీజేపీ-జనసేన లాంగ్‌ మార్చ్‌కి బ్రేక్‌

అమరావతి: బీజేపీ-జనసేన కలిసి నిర్వహించాలనుకున్న లాంగ్‌ మార్చ్‌ వాయిదా పడింది. రాజధాని అమరావతి రైతుల కోసం, మూడు రాజధానులకు వ్యతిరేకంగా బీజేపీ, జనసేన పార్టీలు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలనుకున్నాయి. కాగా లాంగ్ మార్చ్‌ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇంచార్జి తురగా నాగభూషణం తెలిపారు.

ఫిబ్రవరి 2న మధ్యాహ్నం విజయవాడలోని సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్‌ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే దీనికి సంబంధించిన భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో తెలుపుతామని నాగభూషణం ప్రకటించారు. గత బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ, జనసేన నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో భవిష్యత్తు కార్యచరణపై పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, నాందెడ్ల మనోహర్‌, ఎంపీ జీవీఎల్‌, పురందేశరి పాల్గొన్నారు. ఇందులో భాగంగా లాంగ్‌ మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ లాంగ్‌ మార్చ్‌ వాయిదా పడిందని కేవలం బీజేపీ మాత్రమే ప్రకటించింది. దీనికి సంబంధించి జనసేన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే లాంగ్‌ మార్చ్‌ ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.

జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాల భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. కాగా పవన్‌ పేరుతో అసత్య ప్రచారాలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తామని జనసేన పార్టీ న్యాయ విభాగం తెలిపింది.

Next Story