సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేసిన లోకేష్

By రాణి  Published on  25 Jan 2020 8:50 AM GMT
సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేసిన లోకేష్

సాక్షి పత్రికపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. 2019 అక్టోబర్ 22వ తేదీన సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి 25 ల‌క్షలండి’ శీర్షికతో వెలువడిన కథనం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాంటి శీర్షికతో వార్తలు రాసినందుకు గాను సాక్షి పత్రిక రూ.75 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ..లోకేష్ శనివారం ఉదయం విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో దావా దాఖలు చేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నెంబర్ తో ఈ వ్యాజ్యం దాఖలైంది. రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన తనపై తప్పుడు కథనాలు రాసి తన పరువు, ప్రతిష్టలను మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. సాక్షి రాసిన కథనాల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాయనని అందులో తెలిపారు.

ఇందుకు కారణమైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణ కర్త, సంపాదకుడైన వర్థెల్లి మురళి, విశాఖపట్నానికి చెందిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు బి.వెంకటరెడ్డి, గరికపాటి ఉమాకాంత్ లపై లోకేష్ పరువునష్టం దావా దాఖలు చేశారు.

శుక్రవారం ట్విట్టర్ వేదికగా..నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ‘‘ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ద్రోహి @ysjagan గారు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుండి హైదరాబాద్ కు తరిమేస్తున్నారు. ఐటీ సెజ్ ఖాళీ చేయిస్తున్నారు. మూడు ముక్కల రాజధాని వస్తుంది అంటూ విశాఖకు వచ్చేందుకు సిద్ధమైన పెద్ద కంపెనీలను ఛీ కొట్టారు. రాయలసీమకి వస్తా అన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రాకుండా చేసి అభివృద్ధికి ఆటంకంగా మారారు. కర్నూలుకి హై కోర్టు తరలించే ప్రక్రియ గురించి ఆలోచిస్తాం అంటూ మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారు. మూడుముక్కలాట తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పారా జగన్ గారు? మీ స్వార్థం కోసం కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలు కొట్టుకొని చావాలా? ’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



Next Story