ప్లాస్మా దాతలకు రూ. 5 వేలు సాయం
By తోట వంశీ కుమార్ Published on 31 July 2020 10:16 AM GMTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా.. శుక్రవారం కరోనా నివారణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ అధికారులు హాజరయ్యారు. కరోనా నివారణపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చే ప్లాస్మా దాతలకు రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్లాస్మా థెరపీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు అవసరమయ్యే అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్ బోర్డు పెట్టి.. అక్కడి బెడ్ల ఖాళీ, భర్తీ వివరాలను అందులో రాయాలని ఆదేశించారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్ అలాట్ చేయాలని తెలిపారు. కోవిడ్‌కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు.హెల్ప్ డెస్క్‌లో ఉన్న వారికి ఓరియంటేషన్ బాగుండాలన్నారు. హెల్ప్‌డెస్క్ ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ నాటికి విద్యాకానుకతో పాటు ప్రతి పిల్లాడికి మాస్కులు అందించాలని అధికారులకు సూచించారు. వీటిని ఎలా వాడాలో అన్న దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. ఇక మూడేళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.