బంతి కోసం ప్రాణాలను లెక్కచేయని అభిమాని.. వీడియో వైరల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2020 8:51 AM GMT
బంతి కోసం ప్రాణాలను లెక్కచేయని అభిమాని.. వీడియో వైరల్‌

మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. క్రికెటర్లును ఎంతగా ప్రేమిస్తారో అందరికి తెలిసిందే. ఇక మ్యాచ్‌ ఉందంటే ఆఫీసులకు సెలవులు పెట్టి మ్యాచ్‌లు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే.. కరోనా కారణంగా మన దేశంలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి లేదు. కాగా.. అక్కడి స్టేడియాలు చిన్నవిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్లు భారీ సిక్సర్లు బాదేస్తున్నారు. అవి స్టేడియం దాటి పక్కనే ఉన్న రహదారిపై పడుతున్నాయి. కొన్ని సార్లు.. ఆ బంతులు వెళ్లి కార్ల అద్దాలను ధ్వంసం చేస్తున్నాయి.

శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య షార్జా వేదికగా మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ (101 నాటౌట్‌; 58 బంతుల్లో 14పోర్లు, 1సిక్స్‌) శతకానికి.. అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌; 5 బంతుల్లో 3సిక్సర్లు) మెరుపులు తోడవడంతో 180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో ఛేదించింది. మొదట ఫాఫ్ డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6పోర్లు, 2సిక్సర్లు), అంబటి రాయుడు (45 నాటౌట్‌; 25 బంతుల్లో 1పోర్‌, 4సిక్సర్లు), రవీంద్ర జడేజా (33 నాటౌట్‌; 13 బంతుల్లో 4సిక్సర్లు) సత్తా చాటడంతో చెన్నై 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. 9 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి చవిచూసిన చెన్నై ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా వీరవిహారం చేశాడు. జడేజా వచ్చిన తర్వాత సీఎస్‌కే ఇన్నింగ్స్‌ పరుగులు తీసింది. జడేజా కొట్టిన నాలుగు సిక్స్‌లతో సీఎస్‌కే స్కోరు బోర్డు ఈజీగా 170 పరుగుల మార్కును దాటేసింది. అయితే జడేజా కొట్టిన ఒక సిక్స్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్లో స్క్వేర్ లెగ్ సైడ్ జడేజా బాదిన సిక్సర్ ఏకంగా మైదానం బయటపడింది. రోడ్డు మధ్యలో పడిన ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న ఆ అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.



నడి రోడ్డుపై పడిన బంతిని తీసుకున్న ఆ అభిమాని డేరింగ్‌ను కామెంటేటర్లు మెచ్చుకున్నారు. అయితే వీకెండ్‌లో అలా రోడ్డు మధ్యలోకి రావడం చాలా రిస్క్‌ అని కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అన్నారు. అసలు వీకెండ్‌లో రోడ్డుపై తనకు పరుగెత్తే అవకాశమే ఉండదంటూ అది ఎంత ప‍్రమాదకరమో అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. బంతిని ఇంటికి తీసుకెళ్లడం కోసం ఇలా ఫ్యాన్స్‌ బయట వేచి చేయడం ఈ ఐపీఎల్‌లో చర‍్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ అభిమానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story