గబ్బర్‌ శతకం.. దిల్లీ టాప్‌

By సుభాష్  Published on  18 Oct 2020 5:54 AM GMT
గబ్బర్‌ శతకం.. దిల్లీ టాప్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌లో ఢిల్లీ దుమ్ములేపుతోంది. షార్జా వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్‌ సేన

అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్(101 నాటౌట్; 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో చెలరేగడంతో.. ఢిల్లీ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(58;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లులు ), అంబటి రాయుడు( 45 నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లులు ), జడేజా (33 నాటౌట్‌; 13 బంతుల్లో 4సిక్సర్లు) రాణించారు.

అనంతరం.. 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఆ జట్టు ఓపెనర్ పృథ్వీషా.. ఈ మ్యాచ్‌లో సిల్వర్ డకౌటయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(8) కూడా తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ నిరాశపరిచాడు. ఓ ఎండ్‌లో వికెట్లు కోల్పోతున్న మరో ఎండ్‌లో ఉన్న ధవన్‌ దూకుడుగా ఆడాడు. ముచ్చటైన బౌండరీలతో ఇన్నింగ్స్‌ ఆద్యంతం అలరించాడు. కాగా.. ధావన్‌కు రెండు లైప్‌లు(25 పరుగులు, 80 పరుగుల వద్ద) లభించాయి. గబ్బర్‌ 57 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో గబ్బర్‌కు ఇదే తొలి శతకం. ధావన్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌(23), స్టాయినిస్‌(24; 14 బంతుల్లో 1పోర్; 2 సిక్సర్లు) నుంచి సహకారం అందించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. అక్షర్‌ పటేల్‌(21 నాటౌట్‌; 5 బంతుల్లో 3 సిక్సర్లు) బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై

బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు, సామ్‌ కరన్‌, బ్రావో, శార్ధూల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Next Story