ఐపీఎల్‌లో ముంబై జైత్రయాత్ర..

By సుభాష్  Published on  17 Oct 2020 5:11 AM GMT
ఐపీఎల్‌లో ముంబై జైత్రయాత్ర..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ దూకుడు కొనసాగిస్తోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన ముంబై వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం అబుదాబిలో కోల్‌కత్తా నైట్స్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రోహిత్‌ సేన ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. నెట్‌ రన్‌రేట్‌లోనూ మెరుగ్గా ఉన్న ముంబై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

టాస్‌ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కేకేఆర్‌ టాపార్డర్‌ చేతులెత్తేశారు. రాహుల్ త్రిపాఠి(7), నితీశ్‌ రాణా(5), శుభ్‌మన్‌గిల్(21), దినేశ్‌ కార్తిక్‌(4), రసెల్‌(12) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో.. కోల్‌కత్తా 10.4 ఓవర్లకు 61 పరుగులకే 5 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కొత్త కెప్టెన్‌ మోర్గాన్‌( 39 నాటౌట్‌; 29 బంతుల్లో 2పోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి కమిన్స్‌( 53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మోర్గాన్‌ సింగిల్స్‌కే పరిమితం అవ్వగా.. కమిన్స్‌ ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్‌ బౌల్డ్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, బుమ్రా తలో వికెట్‌ సాధించారు.

149 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్‌ ప్రారంభించిన ముంబైకి.. రోహిత్‌, డికాక్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు. మొదట్లో రోహిత్‌ శర్మ(35; 36బంతుల్లో 5 పోర్లు, 1 సిక్సర్) జోరు చూపించగా.. ఆ తరువాత క్వింటన్‌ డికాక్‌(78 నాటౌట్‌; 36బంతుల్లో 9 పోర్లు, 3సిక్సర్లు) రెచ్చిపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లగా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా మాత్రం తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు ముంబై గెలవడం గమనార్హం.

Next Story