Fact Check : ఇటలీ కోవిద్-19 బాక్టీరియాను కనుగొందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2020 5:13 PM ISTకరోనా మహమ్మారి కేసులు ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడానికి చాలా దేశాలు కష్టపడుతూ ఉన్నాయి. కోవిద్-19 వైరస్ ను ఎదుర్కోగల వ్యాక్సిన్ కోసం పలు దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని వ్యాక్సిన్ల విషయంలో హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి.
ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో పలు విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్య వాట్సప్ లో ఇటలీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇటలీలో కోవిద్-19 పేషెంట్ మీద శవ పరీక్షలు నిర్వహించారని.. దాని వలన తెలిసిన విషయం ఏమిటంటే కోవిద్-19 అన్నది వైరస్ కాదు.. అదొక బాక్టీరియా అంటూ కనుగొన్నారని ఓ వీడియో వైరల్ అవుతోంది. నావల్ కరోనా బాక్టీరియా కారణంగా రక్తం గడ్డకడుతోందని.. వెంటిలేటర్ అవసరమే లేదని ఇటలీలో గుర్తించారని పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోల్ని పోస్టు చేస్తున్నారు.
ఫేస్ బుక్ లో కూడా అలాంటి విషయాన్నే పోస్టు చేశారు.
కరోనా కారణంగా చనిపోతుండడానికి కారణం న్యూమోనియా కాదని పోస్టులు వెలుస్తున్నాయి.
న్యూస్ మీటర్ కు ఈ విషయం గురించి నిజ నిర్ధారణ చేయాలనే రిక్వెస్ట్ వచ్చింది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇటలీలో కోవిద్-19 పేషెంట్ మీద శవ పరీక్షలు నిర్వహించారని' చెప్పుకొచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా ద్వారా మరణించిన వారికి శవ పరీక్షలు నిర్వహించకూడదని ఎప్పుడూ చెప్పలేదు. మార్చి 20, 2020న కరోనా కారణంగా మరణించిన వారిపై శవపరీక్షలు నివహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మార్చురీలలో ఆ శవాలను ఉంచడం, వాటిని ఖననం చేయడంపై కూడా పలు సూచనలు జారీ చేశారు.
కోవిద్-19ను బాక్టీరియా అంటూ చెబుతున్నది కూడా అబద్ధం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కోవిద్-19 అన్నది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. వివిధ రకాల కరోనా వైరస్ లు మనుషుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది నావల్ కరోనా వైరస్. కోవిద్-19 కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే యాంటీ బయోటిక్స్ ను వాడమంటారు వైద్యులు. అయితే వైరస్ లను యాంటీ బయోటిక్స్ ద్వారా చంపడం కుదరదని చెబుతోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
కోవిద్-19 కారణంగా రక్తం గడ్డ కడుతోందని.. అందువలనే మనుషులు మరణిస్తూ ఉన్నారని వైరల్ అవుతున్న పోస్టులో ఉంది. వివిధ రీసెర్చులలో కోవిద్-19 కారణంగా బ్లడ్ క్లాట్ అవ్వడమే కాకుండా న్యూమోనియా విపరీతంగా పెరగడం ద్వారా కూడా కరోనా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్న హర్పిన్ ను ఉపయోగించడం కారణంగా త్రొమ్బోఎంబలిజం ను కోవిద్-19 పేషెంట్స్ లో తగ్గించవచ్చు. రోగుల్లో ఈ కండీషన్ కారణంగా కాళ్లలోని నరాల్లో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం ద్వారా పల్మొనరీ త్రొమ్బోసిస్ కు దారి తీస్తుంది.
వెంటిలేటర్లు కరోనా వైరస్ పేషెంట్స్ కు ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. అందరు కోవిద్-19 పేషెంట్స్ కు వెంటిలేటర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎవరైతే తీవ్ర అనారోగ్యానికి గురై ఉంటారో, క్రిటికల్ గా ఉన్న వారికి మాత్రమే వెంటిలేటర్లు అవసరం ఉంటుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పై వార్త పచ్చి అబద్ధం.