Fact Check : చైనీయుడు వెన్నుపోటు పొడుస్తున్న శిల్పం శ్రీరంగం గుడిలో 700 ఏళ్ల క్రితమే చెక్కారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 July 2020 1:34 PM GMT
Fact Check : చైనీయుడు వెన్నుపోటు పొడుస్తున్న శిల్పం శ్రీరంగం గుడిలో 700 ఏళ్ల క్రితమే చెక్కారా..?

భారత్-చైనా దేశాల సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించారు. చైనా సైనికుల మరణంపై ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. చైనా మీద భారత్ అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీసుకుని వస్తోంది. భారత అంతర్గత రక్షణ కోసం చైనాకు చెందిన 59 యాప్స్ ను కూడా భారత్ లో బ్యాన్ చేసింది. హై లెవెల్ మీటింగ్ ను భారత్ ఏర్పాటు చేసింది కూడానూ.. ఈ మధ్యనే చైనా సైన్యం వెనక్కు మళ్లినట్లు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు లోని శ్రీరంగం దేవాలయంలో చైనీస్ వ్యక్తి వెనుక నుండి పొడుస్తున్న శిల్పం ఉందని తెలియజేస్తూ ఆ ఫోటోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనీయుల ముఖ కవళికలు ఉన్న ఓ వ్యక్తి మరో యోధుడి కాలులోకి పొడుస్తున్న శిల్పం అది. చాలా మంది అది చైనీయులు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.

“Indians knew it 700 years back; they carved a “back-stabbing Chinese trader” in #Srirangam temple as a perpetual lesson..! Look at the facial features, cap & attire. (sic)” అంటూ ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. చైనా నుండి వచ్చిన వర్తకుడు వెన్ను పోతూ పొడిచాడని.. ఆ విషయం భారతీయులకు 700 సంవత్సరాల క్రితమే తెలుసునని.. శ్రీరంగం దేవాలయంలో అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని పోస్టులో పెట్టారు. కావాలంటే ముఖ కవళికలు, అతడి వేషధారణ కూడా గమనించండి అంటూ చెప్పుకొచ్చారు కొందరు ట్విట్టర్ యూజర్లు.

ఫేస్ బుక్ లో కూడా ఈ ఫోటోను బాగా వైరల్ చేశారు. మన పూర్వీకులు చైనీయుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు.

నిజ నిర్ధారణ:

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోతో శ్రీరంగం దేవాలయం లోని శేషరాయం మండపానికి చెందినది. UNESCO వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ మండపాన్ని విజయనగర రాజుల కాలంలో కృష్ణ దేవరాయలు నిర్మించిందని తెలుస్తోంది. ఆ మండపంలో ఎన్నో గుర్రాల గురించి, యుద్ధ ఘటనల గురించి శిల్పాలను ఉంచారు.

ఆ విగ్రహం ఓ యుద్ధ ఘటనకు సంబంధించినది. ప్రొఫెసర్ డాక్టర్ బాలుస్వామి ఈ శిల్పం గురించి తమిళ వెబ్ సైట్ కు వివరణ ఇచ్చారు. ఆ వీడియో పోర్చుగీసు వర్తకుడికి చెందినది చెప్పారు.

బాలుస్వామి కుడ్య చిత్రాల విషయంలో ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన 35 రీసర్చ్ ఆర్టికల్స్ రాయడమే కాకుండా నాలుగు కాన్ఫరెన్స్ లను కుడ్య చిత్రాలపై నిర్వహించారు. ఆయన 10కి పైగా పుస్తకాలను రచించారు. తమిళనాడు ప్రభుత్వం ఆయన రాసిన 'మామళ్ళపురం-అర్జునన్ తాపసు' పుస్తకానికి ఉత్తమ పుస్తకంగా అవార్డును బహూకరించింది. ఎన్నో చోట్ల ఆయనను ఘనంగా సత్కరించారు.. అవార్డులను కూడా అందుకున్నారు. భారతి సెల్వార్, బెస్ట్ రీసెర్చర్ అవార్డులను అందుకున్నారు.

ఆ శిల్పం గురించి ఆయన చెబుతూ విజయనగర సామ్రాజ్యానికి పోర్చుగీసు వర్తకులు గుర్రాలను సరఫరా చేస్తూ ఉండేవారు. పోర్చుగీసుకు చెందిన వారు తుపాకులను వాడడంలోనే కాకుండా, యుద్ధాలు చేయడంలో కూడా ఎంతో నైపుణ్యం కలిగిన వారు. దీంతో పోర్చుగీసు వారిని యుద్ధంలో నైకర్ల కోసం పోరాడామని అడిగేవారు. కొన్ని కొన్ని సార్లు నైకర్లకు వ్యతిరేకంగా కూడా పోరాడేవారు. మండపంలో ఉన్న శిల్పాలు అప్పటి యుద్ధం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ శిల్పానికి వేసిన కోట్, క్యాప్ పోర్చుగీసు యోధుడికి చెందినవి. అంతేకానీ చైనీయులు వెన్నుపోటు పొడుస్తోంది కాదని బాలస్వామి స్పష్టం చేశారు.

13వ శాతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ ఉలుఘ్ ఖాన్ చేసిన దండయాత్రకు సంబంధించిన శిల్పం అని కూడా నమ్మేవారు. దీనిపై Amarujala ఓ కథనాన్ని వెలువరించింది.

చైనీయుడు వెన్నుపోటు పొడుస్తున్న శిల్పం శ్రీరంగం గుడిలో 700 ఏళ్ల క్రితమే చెక్కారన్నది అబద్ధం.

Next Story