ఇటలీలో లక్ష దాటిన కరోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 April 2020 6:47 AM GMT
ఇటలీలో లక్ష దాటిన కరోనా కేసులు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి శాపంగా మారింది. 200 దేశాలపై పంజా విసిరింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు ఈ మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇటలీలో రోజులు గడిచేకొద్దీ అక్కడ వైరస్‌ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగా అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.

తాజాగా అక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. మంగళవారం రాత్రి సమయానికి ఇటలీలో 1,01,739 కరోనా కేసులు నమోదవగా, మృతుల సంఖ్య 11,591కు చేరింది. అయితే కేసుల సంఖ్యలో 1,64,719తో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉంది. మృతుల్లో మాత్రం ఇటలీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అయితే కేసుల నమోదు రేటు తగ్గిందని స్థానిక మీడియా పేర్కొంది. గత సోమవారం 4,789 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సోమవారం 1,648కు పరిమితమైంది. మరోవైపు ఇటలీ విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 3తో ముగియనుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సుమారు ఈస్టర్ తరువాత కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందంటున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి.మరణించిన వారి స్మారకార్థం మంగళవారం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మిలన్‌లో తొలి కరోనా కేసు గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్‌ దేశమంతా వ్యాపించింది. మూడు వారాలుగా అక్కడ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లక్ష మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు.

ఐరోపా కూటమిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీ ఈ దెబ్బతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఏప్రిల్‌ మధ్య వరకు షట్‌డౌన్‌ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మే చివరి వారం వరకు అక్కడ దుకాణాలు తెరిచే పరిస్థితి కనిపించడమే లేదు.

Next Story