నిద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

By అంజి  Published on  1 April 2020 6:22 AM GMT
నిద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

హైదరాబాద్‌: ఆధునికయుగం అతి వేగంగా దూసుకెళ్తోంది. టెక్నాలజీ పెరగడంతో మనుషుల్లో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. చాలా మందికి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. రాత్రి సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు చూస్తూ నిద్ర పోకపోవడంతో దాని ప్రభావం ఉద్యోగం, చదువులపై తీవ్రంగా చూపిస్తోంది. మన జీవనం సరిగా సాగాలంటే మంచిగా నిద్ర పోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు తగినంత నిద్ర పోతే.. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది. అయితే ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని వైద్యులు, నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 8 గంటల నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని చెబుతోంది. అయితే ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అని, 10 గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అని అంటారు. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చెటు చేసేవే. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలి. అలాగే చిన్న పిల్లలు 11 గంటలు, టీనేజీలో ఉండే వారు 10 గంటలు నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తెలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. యుక్త వయసులో కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే అది మధుమేహానికి దారి తీసే అవకాశాలున్నాయి. నిద్రలేమి సమస్య రోగనిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలున్నాయని అధ్యయనాలు అంటున్నాయి. సరిగా నిద్ర పోకపోతే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

Also Read: ఆ సుఖాన్ని మహిళలు పొందలేకపోతున్నారట..

నిద్రలో దశలు కూడా ఉంటాయి. ప్రతి దశ సుమారు 60 నుంచి 100 నిమిషాల వరకూ ఉంటుంది. మొదటి దశ నిద్రలో శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. ఆ తర్వాత ఆందోళన, ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కండరాలు విశ్రాంతి చెంది.. హృదయ స్పందన రేటు క్రమంగా తగ్గుతుంది. ఇక రెండో దశలో మాత్రం ఎక్కడో మేలుకొని ఉన్నామనే భావన మాత్రం మనసులో కలుగుతుంటుంది. మూడో దశలో నిద్ర మరింత గాఢంగా ఉంటుంది. ఈ దశలో దాదాపుగా మనం మేల్కోనడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు.

యుక్తవయస్సులో ఉన్నవారు కనీసం 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. అయితే అందులో సగం మంది కూడా అలా నిద్ర పోవడం లేదని అధ్యయనంలో తేలింది. చాలా మంది ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో కాలం గడుపుతూ నిద్రకు దూరం అవుతున్నారు. అలాగే షిప్టుల్లో పని చేసే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. షిప్ట్‌ల కారణంగా తక్కువ నిద్ర పోయే వారికి మధుమేహాం, ఊబకాయం వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

Next Story
Share it