కరోనా వైరస్‌: ఆమె త్యాగం ఎంతో గొప్పది.. కన్నీటి పర్యంతమైన వైద్యులు

By సుభాష్  Published on  1 April 2020 6:22 AM GMT
కరోనా వైరస్‌: ఆమె త్యాగం ఎంతో గొప్పది.. కన్నీటి పర్యంతమైన వైద్యులు

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. దేశాలను సైతం వణికిస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కారోనా కాటుకు బలవుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాదిగా మృత్యువాత పడగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కరోనా కారణంగా ఓ వృద్ధురాలు పెద్ద మనసు చేసుకుని త్యాగం చేశారు. బెల్జియంకు చెందిన 90 సంవత్సరాలున్న సుజాన్‌ హోయలార్ట్స్‌ అనే వృద్ధ మహిళకు కరోనా వైరస్‌ సోకింది. వైరస్‌ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. వ్యాధి ముదిరి ఆకలి మందగించడంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆమెకు వెంటిటేటర్‌ను అమర్చేందుకు వైద్యులు సిద్దమయ్యారు.

ఇక్కడే ఆమె పెద్దమనసు చేసుకుంది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ఆమె.. నాకు కృత్రిమ శ్వాసను ఉపయోగించడం ఇష్టం లేదని తెలిపింది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన చాలా మంది మృత్యువాత పడుతున్నారని, తనకు వెంటిలేటర్‌ వద్దని ఆమె నిరాకరించింది. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్నవారికి దానిని ఉపయోగించమని చెప్పింది. చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక, వెంటిలేటర్‌ను ఇతరులకు ఉపయోగిస్తే బాగుంటుందని ఆమె వైద్యులతో తెలిపింది. ఇక చివరకు ఆమె కరోనా కాటుకు కన్నుమూసింది.

దీంతో ఆమె చేసిన త్యాగం మరువలేనిదని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 42 వేలకుపైగా మృతి చెందగా, 8 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా వైరస్‌ ప్రపంచంలో అన్ని దేశాలను కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది.

Next Story