ఐదు రోజుల్లో రేష‌న్ కార్డు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2020 8:34 PM IST
ఐదు రోజుల్లో రేష‌న్ కార్డు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..

మీకు రేష‌న్ కార్డు లేదా..? అయితే వెంట‌నే రేష‌న్ కార్డు కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొండి ఐదు రోజుల్లోనే రేష‌న్ కార్డు మీ చేతుల్లో ఉంటుంద‌ని అంటోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. క‌రోనా వ్యాప్తిని నిరోదించ‌డానికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ విధించ‌డంతో పేద‌ల క‌డుపు నింప‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా ఆక‌లితో అల‌మటించ‌కూడ‌ద‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. రేషన్ కార్డు లేకున్నా.. అర్హులైతే బియ్యం అందజేయాలన్నారు. దీంతో.. ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు ఇస్తామ‌ని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేర‌కు అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం మంత్రి మీడియాలో మాట్లాడారు. రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు అదిగమించేలా చర్యలు చేపట్టామ‌ని, రేషన్ తో పాటు రూ.వెయ్యి నగదు సాయం అందనివారికి త్వరలోనే అందిచ‌నున్నామ‌ని తెలిపారు. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, వాలంటీర్ల ద్వారా రేషన్‌దారులకు కూపన్లు అందిస్తున్నామన్నారు. ఆ కూపన్ల మీద ఉన్న టైం ప్ర‌కార‌మే రావాల‌ని, ముందుగా వ‌చ్చిన రేష‌న్ ప్ర‌మోజ‌నం ఉండ‌ద‌న్నారు.

దారిద్య్రపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును అందజేస్తోంది. ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది. కాగా.. ప్రస్తుతం ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేష‌న్ కార్డును ఇలా పొందండి..

  • అర్హులైన వారు ద‌గ్గ‌రిలోని మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తు ఫారాలు తీసుకోవాలి. ఫారాలు లేక‌పోయిన‌ట్ల‌యితే.. మీసేవ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
  • ద‌ర‌ఖాస్తులో పూర్తి వివ‌రాలు నింపి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను(ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ త‌దిత‌ర డాక్య‌మెంట్లు) జ‌త‌చేయాలి.
  • ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి.
  • మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్‌ను భద్రపర్చుకోవాలి. ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది.
  • మెసేజ్‌లోని నెంబ‌ర్, మీసేవ నిర్వాహ‌కులు ఇచ్చిన స్లిప్‌ను తీసుకెళ్లి మీ సేవ‌లో అంద‌జేస్తే రేష‌న్ కార్డు ఇస్తారు. అంతేకాకుండా.. 'స్పందన' యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చున‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

Next Story