అంత ప‌చ్చిగా మాట్లాడిన వంశీ.. అదే పార్టీలోకి వెళుతున్నారా.?

By Medi Samrat  Published on  26 Oct 2019 6:28 AM GMT
అంత ప‌చ్చిగా మాట్లాడిన వంశీ.. అదే పార్టీలోకి వెళుతున్నారా.?

కృష్ణా : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహార తీరు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒకే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం ఆసక్తిని రేపుతోంది. వంశీ ఎందుకు కలిశారు. ఒకే రోజు రెండు పార్టీలకు చెందిన కీలక వ్యక్తులతో భేటీ అవ్వడం వెనుక ఆంతర్యమేంటి అనేది ఇప్పుడు రాజకీయ అవగాహన ఉన్న ప్రతిఒక్కర్నీ ఆలోచింపజేస్తున్నాయి. దీనిపై ఎన్నో రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

వంశీ త్వరలోనే బీజేపీ లేదంటే వైసీపీలో జాయిన్ అవుతారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు పార్టీని వీడాల్సిన అవసరం వంశీకి ఏంటి.? ఒక వేళ సొంత పార్టీకి గుడ్‌బై చెబితే ఏ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. నిజానికి గతకొన్నాళ్లుగా పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఇందుకు మరింత ఊతమిస్తోంది. పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు కొందరు నేతలు జైల్లో ఉండ‌టం కూడా చూస్తున్నాం. ఇవే వంశీని ప్రభావితం చేశాయి అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

టీడీపీలోనే ఉంటే తనపై ఉన్న నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుల పేరుతో అరెస్ట్ చేస్తారేమోనని.. లేదంటే ఇబ్బందులకు గురి చేస్తారేమోనని భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. అధికార పార్టీ పెద్దగా విమర్శలు చేయలేని బీజేపీ పార్టీలో ఉంటే బావుంటుందని యోచన చేస్తున్నట్టుగా తెలిసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీ మద్దతు ఉంటే ఎలాంటి ఢోకా ఉండదని ఫీలవుతున్నట్టు సమాచారం.

ఇంత వరకు బాగానే ఉన్నా ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ మంచిదనే వంశీ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఏ కాంట్రాక్ట్ రావాలన్నా...ఎలాంటి వ్యాపారం చేయాలన్నా అధికార పార్టీ మద్దతు ఉండాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరున్న వంశీకి.. వైసీపీ ప్రభుత్వ అండ ఉంటే కచ్చితంగా లాభపడతారు అనేది కాదనలేని సత్యం. లేదంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమే. అందుకే వైసీపీలో చేరిక అంశంపై కూడా వంశీ ఆలోచన చేస్తున్నారని సమాచారం.

వైసీపీలోకి వెళ్తే ఆర్థికంగా నిలదొక్కోకోవడంతో పాటు కేసుల చిక్కుల నుంచి బయటపడవచ్చని వంశీ భావిస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని చెప్పినట్టుగా తెలిసింది. కొడాలి నాని, వంశీ స్నేహంగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొడాలి నాని ప్రొద్భలంతోనే వంశీ వైసీపీలో చేరితే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్టు స‌మాచారం. వంశీను కూడా పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక వంశీ కూడా బీజేపీలో కంటే వైసీపీలో చేరడమే అన్ని విధాలా శ్రేయస్క‌ర‌మ‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. గ‌తంలో జ‌గ‌న్ పై అనేక సార్లు మండిప‌డ్డ వంశీ.. ఓ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. జ‌గ‌న్ వ్యాపారాలు అన్ని ప్ర‌జాధ‌నంతో, అక్ర‌మ సంపాద‌న‌తో నిర్మించుకున్న‌వే అని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. అన్నం తినే వాడేవ‌డూ.. వైసీపీలో చేర‌ర‌ని.. నేను మాత్రం అన్న‌మే తింటున్నాన‌ని.. వైసీపీలో చేర‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Next Story
Share it