Fact Check : లెబనాన్ రాజధానిలో చోటుచేసుకుంది అణువిధ్వంసమా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 12:26 PM IST
Fact Check : లెబనాన్ రాజధానిలో చోటుచేసుకుంది అణువిధ్వంసమా..?

లెబనాన్ రాజధాని బీరూట్ లో భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే..! వేలాది భవనాలు తీవ్రంగా దెబ్బతినగా, ప్రజలు మొత్తం నగరాన్ని వీడి వెళ్లిపోయారు. 3,00,000 మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. బహుళ అంతస్తుల భవంతులన్నీ నిర్మానుష్యమైపోయాయి. మొత్తం 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు జరుగగా, 100 మందికి పైగా మరణించారు.. 4000 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తరువాత గాల్లోకి విషవాయువులు వ్యాపించడంతో, దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉండటంతోనే ప్రజలంతా తమతమ నివాసాలను విడిచి వెళ్లిపోయారు. బీరూట్ పోర్ట్ ప్రాంతంలో గత ఆరు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా రసాయనాలను నిల్వ ఉంచడమే ఈ భారీ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఆగష్టు 4, 2020న చోటు చేసుకున్న ఈ ఘటనకు కారణం అణువిధ్వంసం అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు అంటూ పోస్టు చేసి.. ఇది న్యూక్లియర్ పేలుడేనని చెబుతూ వస్తున్నారు.

veteranstoday.com అనే వెబ్సైట్ ఈ ఘటనపై వార్తను ప్రచురించింది. ‘Israel Hits Beirut with Nuclear Missile, Trump and Lebanese Govt. Confirm.’ ఇజ్రాయెల్ బీరూట్ మీద న్యూక్లియర్ మిసైల్ ను వేసింది.. ట్రంప్, లెబనీస్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది అంటూ వార్తను ప్రచురించింది.

11

నిజ నిర్ధారణ:

లెబనాన్ రాజధాని బీరూట్ లో విధ్వంసానికి కారణం అణ్వాయుధంతో దాడి చేయడం లేదా.. అణువిధ్వంసం అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

స్థానిక రిపోర్టుల కారణంగా ఈ విధ్వంసానికి కారణం ఓ గోడౌన్ లో నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడమే..! 2013 లో రష్యాకు చెందిన కార్గోలో ఈ అమ్మోనియం నైట్రేట్ బీరూట్ కు చేరింది. బీరూట్ లోని హ్యాంగర్ 12లో ఈ అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ ఉంచారు.

కస్టమ్స్ అధికారులు ఆ అమ్మోనియం నైట్రేట్ ను డిస్పోజ్ చేయడానికై మూడేళ్ళుగా అధికారులకు లెటర్లు రాసిన రిపోర్టులను న్యూస్ మీటర్ సేకరించింది. వాళ్లు మూడు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, లెబనీస్ ఆర్మీకి అందించడం, లెబనీస్ కు చెందిన ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు అమ్మేయాలని సలహాలు ఇచ్చారు.

businessinsider.in కథనం ప్రకారం ఈ పేలుడు సంభవించినప్పుడు పుట్టగొడుగు ఆకారంలో ఆకాశంలో దట్టమైన మేఘం ఏర్పడింది. ఇది కేవలం న్యూక్లియర్ పేలుళ్ల కారణంగానే ఏర్పడదని తెలిపారు. గాలి లోకి వివిధ రకాల గ్యాస్ లు విడుదలైనప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయని తెలిపారు.

లెబనీస్ అధికారులు కూడా అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని ధృవీకరించారు. వాసన లేని స్ఫటికాకారపు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్ ను ఫెర్టిలైజర్ గా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా పరిశ్రమల్లో పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ కారణమని చెబుతూ ఉన్నారు. ఇంధన చమురుతో కలవడం వలన అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థంగా మారుతూ ఉంటుంది. తాలిబన్లు కూడా ఈ పేలుడు పదార్థాలను ఉపయోగించే వారు. ప్యూరిటీ కలిగిన అమ్మోనియం నైట్రేట్ పేలడం చాలా అరుదు. ఇతర పదార్థాలతో కలిపినప్పుడే పేలుడు అన్నది సంభవిస్తూ ఉంటుంది.

ఈ పేలుడు తర్వాత ఎరుపు రంగులో వచ్చిన పొగకు కారణం నైట్రస్ ఆక్సయిడ్ కారణం అని.. ఇవి అమ్మోనియం నైట్రేట్ బై ప్రోడక్ట్స్ అని తెలుస్తోంది.

22

న్యూక్లియర్ పేలుడు అన్నది చాలా భారీగా ఉంటుంది. సూర్యుడి మధ్యలో ఎంత వేడి ఉంటుందో ఆ స్థాయిలో వేడి అన్నది ఉత్పన్నమవుతుంది. న్యూక్లియర్ వెపన్స్ కారణంగా జరిగే విధ్వంసం ఎన్నో రెట్లు దారుణంగా ఉంటుంది. బీరూట్ లో చోటుచేసుకుంది న్యూక్లియర్ పేలుడు కాదని పలువురు నిపుణులు కూడా వెల్లడించారు.

లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుళ్లకు కారణం అణువిధ్వంసం కాదు..!

Next Story