FACT CHECK : కరోనాకు ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం చిట్కా’ పనిచేస్తుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2020 11:44 AM IST
FACT CHECK : కరోనాకు ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం చిట్కా’ పనిచేస్తుందా?

హైదరాబాద్: గత రెండురోజులుగా సోషల్ మీడియా, వాట్సాప్ లలో లయన్ రంగా వెంకటేశ్వర రావు గారి పేరిట ఒక మెసేజ్ బాగా వ్యాప్తి చెందుతోంది. ఆ మెసేజ్ ప్రకారం, వెంకటేశ్వర రావు గారు కరోనా మహమ్మారికి కేవలం ఒక రూపాయి ఖర్చుతో చిట్కా వైద్యం కనిపెట్టారని, దీనిని ఆయన స్వయంగా వాడి, ఎందరో కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు సూచించటం వల్ల వారు కోలుకున్నారని, దానిని పాటించినా ఎవరికైనా ఫలితం లేకపోతే Rs.50,000/- రివార్డు ప్రకటించారని ప్రచారం జరుగుతోంది.

A1

A2

ఆ మెసేజ్ పూర్తి పాఠం:

---------------------------------------------------

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోడా కరోనాకు షాక్

ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు "అల్లాఉద్దీన్ అద్భుత దీపం "చిట్కా

---------------------------------------నాసికా రంధ్రాల్లో (ముక్కులో )ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుంది . దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలి. తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె లో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలి.

ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చెసినచో వారికి రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది అని ఛాలంజ్ చెయ్యడం జరిగింది.

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విలన్ ఐతే,తేలికగా నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు"రంగా వెంకటేశ్వరరావు "

నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుంది. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు, గదుల్లోను, వస్త్రములపై ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని అమ్మ లాంటి నిమ్మ వల్ల అనేక లాభాలున్నాయని చెబుతున్నారు మన రంగా వేంకటేశ్వరరావు గారు.

భయం తో వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఈ గొప్ప ఉపాయం కనుగొన్న వ్యక్తి నిడదవోలు పట్టణ" రంగా "వారి ముద్దుబిడ్డ శ్రీ రంగా సుబ్బారావు - సత్యవతి పుణ్య దంపతుల కుమారుడు.

MJF Ln. రంగా వెంకటేశ్వరరావు గారు పచ్ఛిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా ఉన్న క్లబ్ నకే కాకుండా ఇతర క్లబ్ లకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి జిల్లాలోనే ఉత్తమ అధ్యక్షులుగా ప్రధమ బహుమతి పొంది, ప్రస్తుతం కూడా జిల్లా సేవా కోఆర్డినేటర్ గా ఉండిరి.

పైన చెప్పిన విధంగా వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు సూచించి వారు కూడా ఫలితం పొందిన తర్వాత వారినుండి అభినందనలు పొందడం కూడాజరిగిందని మీకు తెలియజేయుచున్నాము.

ఒక సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది.

అమ్మ లాంటి ఒక నిమ్మరసం చుక్క ప్రాణాన్ని కాపాడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు.

------------------------------------------------------

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ సందేశం వెనుక నిజాన్ని తెలుసుకునేందుకు న్యూస్ మీటర్ నిడదవోలులోని రంగా వెంకటేశ్వరరావు గారినే సంప్రదించింది. అప్పటికే కొన్ని టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన.. న్యూస్ మీటర్ తో నవ్వుతూ మాట్లాడారు.

A3

ఆయన చెప్పినదాని ప్రకారం అసలు ఏం జరిగిందంటే..

కొన్ని రోజుల క్రితం నాసికా రంధ్రాలు మూసుకు పోయి ఆయన బాగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు కరోనా కేసుల తీవ్రత పెరుగుతూ ఉండటం, ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు కూడా లేవనే వార్తలు ఆయనను బాగా ఆందోళనకు గురిచేశాయి. గతంలో పండ్ల వ్యాపారం చేసిన కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు నిమ్మకాయకు గల లక్షణాలు, అది చేయగల మేలు గుర్తుకు వచ్చాయి. ఒకటి రెండు చుక్కలు నిమ్మరసాన్ని నాసికారంధ్రాలలో వేసుకుని ఎగపీల్చిన తర్వాత శ్లేష్మాన్ని ఉమ్మివేయటంతో ఆయనకు రిలీఫ్ అనిపించింది. నిమ్మరసం, ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో పుక్కిలించి ఊసేసిన తర్వాత ఇంకా బాగుందనిపించింది. నిమ్మరసంలో ఉన్న జఠరత్వం ఏ వైరస్ ను దరి చేరనివ్వదనే నమ్మకంతో తలపై, శరీరంపై, వస్త్రాలపై రెండుమూడు చుక్కలు రోజూ చల్లుకుంటున్నారు.

తన అనుభవాన్ని మిత్రులతో పంచుకున్న ఆయన, తన ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం చిట్కా’ వైద్యం కచ్చితంగా పనిచేస్తుందని, ఎవరికైనా పనిచేయకపోతే యాభైవేల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశారు.

ఈ ఛాలెంజ్ కేవలం జనంలో ధైర్యాన్ని నింపటానికే చేశానన్న వెంకటేశ్వర రావు, తాను కరోనాను దేవుడిలా భావిస్తున్నానని చెప్పారు. కరోనా పేరు చెబితేనే భయపడుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారని, వారిలో అందరూ ఆసుపత్రులకు వెళ్లలేరని, మరికొందరు బయటకు చెప్పుకోలేరని అన్నారు. కరోనా వైరస్ సోకిన తర్వాత అది గొంతులో కొద్దికాలం ఉంటుంది కాబట్టి, తరచుగా నిమ్మరసాన్ని ముక్కులో వేసుకోవటం, వేడి ఉప్పునీటితో పుక్కిలించటం, బట్టలపై, తలపై రాసుకుంటూ ఇంటిలో చల్లటం వల్ల వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉండవచ్చని ఆయన సిద్ధాంతీకరించారు.

A4

ఇలా కరోనా లక్షణాలలో ఒకటైన ముక్కుదిబ్బడ లేదా నాసికారంధ్రాలు మూసుకుపోవటమనే లక్షణాలు ఉన్న ఏ వ్యక్తినయినా తనవద్దకు తీసుకువస్తే.. కొంత సమయంలో తన చిట్కా వైద్యంతో రిలీఫ్ తెప్పిస్తానని, లేకపోతే Rs 50000 ఇస్తానని చెప్పారు. ఇది కేవలం తన తోటి ప్రజల మేలుకోరి, లాభాపేక్ష లేకుండా చేస్తున్న సేవ మాత్రమేననీ ఆయన అన్నారు.

అయితే, తనకు కానీ, తన చిట్కా వైద్యం నమ్మినవారెవరికీ కరోనా పాజిటివ్ రాలేదని, అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇది పనిచేస్తుందని తాను చెప్పలేనని ప్రకటించారు.

ఏఐఐఎంఎస్ ఎండీ డాక్టర్.బి.వెంకటేశ్వర్ రావు ఈ చిట్కాను ఖండించారు. నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో pH లెవెల్స్ పెరగడం వలన వైరస్ అందులో బ్రతకలేదని చెబుతున్నారు.. కానీ చేసిన ప్రయోగాల్లో కరోనా వైరస్ ఎక్కువ pH లెవెల్స్ లో కూడా బ్రతకగలదు. ఇలా నిమ్మకాయ రసాన్ని నీళ్లతో తీసుకోవడం వలన కరోనా వైరస్ చనిపోదు. గొంతులో మంట ఉన్నప్పుడు వేడి నీటిని నోటిలో వేసుకుని పుక్కిలించడం వలన కొంచెం ఉపశమనం అన్నది లభిస్తుందని ఆయన తెలిపారు. కానీ ఆరెంజ్ జూస్, లెమన్ జూస్ లకు దూరంగా ఉండడమే మంచిదని ఆయన సూచించారు.

జింక్, విటమిన్ సి, విటమిన్ డి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అన్నది పెరుగుతుందని.. దీని వలన కోవిద్-19 ఇన్ఫెక్షన్ తగ్గుతుందని అన్నారు. పైన చెప్పిన విధంగా చేయడం వలన కోవిద్ ఇన్ఫెక్షన్లను ఎంత వరకూ ఆపవచ్చో.. దానిపై ఇంకా ప్రయోగాలు చేస్తున్నారని డాక్టర్ బి.వెంకటేశ్వర రావు తెలిపారు.

దీంతో.. కరోనాకు ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం చిట్కా’ పనిచేస్తుందనే ప్రచారం అసత్యం అని నిరూపితమయింది.

  • ఎన్. ఎన్. ధర్మసేన

Next Story