గవాస్కర్‌ను గౌరవిద్దాం.. అనుష్కకు ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sep 2020 10:32 AM GMTపంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్, మేటి ఫీల్డర్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ వివాదాన్ని రేపాయి. ఈ అంశంలో కొందరు గవాస్కర్‌కు మద్దతుగా ఉంటే.. మరికొందరు అనుష్క చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కే తన మద్దతు ఉంటుందని పఠాన్ ట్విటర్ ద్వారా తెలిపాడు.
లెజండరీ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ ను గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన వయసును గౌరవించాలంటూ ట్వీట్ చేశాడు.
ఇక అసలు విషయంలోకి వెళితే.. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో విరాట్ కోహ్లీ రాణిస్తాడని బెంగళూరు ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. కోహ్లీ అయిదు బంతులను మాత్రమే ఆడి షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే.
విరాట్ కోహ్లీ అవుటైన వెంటనే టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.. ఓ హాట్ కామెంట్ చేశాడు. లాక్‌డౌన్ సమయంలో కేవలం అనుష్క బౌలింగ్‌లోనే అతను ప్రాక్టీస్ చేయడం మనం వీడియోలో చూశాం. అయితే దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని గావస్కర్ పేర్కొన్నారు.
గవాస్కర్ వ్యాఖ్యలపై అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘మిస్టర్ గవాస్కర్.. మీ వ్యాఖ్యలు అమర్యాదగా ఉన్నాయి. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్యలు మీ నుంచి ఎలా వచ్చాయి. నా భర్త ప్రదర్శన గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి మీ వద్ద ఇంకా ఎన్నో పదాలు ఉండి ఉంటాయి. నా పేరు తీసుకొస్తేనే ఆ పదాలకు విలువుంటుందా.. క్రికెట్‌లో దిగ్గజంలాంటి మీరు చేసిన వ్యాఖ్యలతో నేను ఎంత బాధ పడ్డానో తెలియాలనే ఇదంతా చెబుతున్నానని అనుష్క ఫైర్ అయింది.