ఐపీఎల్ కన్ఫర్మ్.. 51 రోజుల పాటూ మెగా ఈవెంట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 8:14 AM GMT
ఐపీఎల్ కన్ఫర్మ్.. 51 రోజుల పాటూ మెగా ఈవెంట్..!

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు సంబంధించిన తేదీలు కూడా వచ్చేశాయి. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకూ ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించనున్నామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శుక్రవారం నాడు మీడియాకు తెలిపారు. వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుందని పలు అంశాలపై చర్చించనున్నామని బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. ఫ్రాంచైజీలతో చర్చించడంతో పాటూ, బ్రాడ్ కాస్టర్స్ సూచనల గురించి కూడా మాట్లాడనున్నామని బ్రిజేష్ తెలిపారు.

'గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అతి త్వరలోనే నిర్వహించబోతున్నాం. ఇప్పటికే షెడ్యూల్ ను ఫైనల్ చేశాం. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకూ నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో 51 రోజుల పాటూ ఐపీఎల్ ను నిర్వహించనున్నాం' అని బ్రిజేష్ పటేల్ తెలిపారు.

ఐసీసీ అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహించాలని భావించిన టీ20 వరల్డ్ కప్ ను పోస్ట్ పోన్ చేయడంతో ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ పావులు కదిపింది. ఇప్పటికే బీసీసీఐ ఫ్రాంచైజీలను సమాయత్తం కావాలని కోరినట్లు చెబుతున్నాయి. టోర్నీ జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా బీసీసీఐ యుఎఈ బోర్డుకు లెటర్ రాసింది. అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు.

యుఏఈలో మొత్తం మూడు స్టేడియంలు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియం, షేక్ జాయద్ స్టేడియం(అబుదాబి), షార్జా గ్రౌండ్ లు అందుబాటులో ఉన్నాయి. ఐసీసీ అకాడెమీకి చెందిన గ్రౌండ్ లను బీసీసీఐ అద్దెకు తీసుకోనుంది. అందులో ఫ్రాంచైజీలకు చెందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేయనున్నారు.

ఐసీసీ అకాడెమీలో రెండు పూర్తి స్థాయి క్రికెట్ గ్రౌండ్ లు ఉన్నాయి. 38 టర్ఫ్ పిచ్ లు, ఆరు ఇండోర్ పిచ్ లు ఉన్నాయి. అలాగే 5700 చదరపు అడుగుల ప్రాంతం కూడా అందుబాటులో ఉండనుంది. ఫిజియోథెరపీ, మెడిసిన్ సెంటర్లు ఆ ప్రాంతంలో ఉన్నాయి.

దుబాయ్ నిబంధనల ప్రకారం కోవిద్-19 నెగటివ్ వచ్చిన వ్యక్తులు క్వారెంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు, సిబ్బంది దగ్గర కోవిద్ -19 నెగటివ్ రిపోర్టులు ఉంటే చాలు.. లేకపోతే అధికారులే టెస్టులు నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 26 నుండి ఐపీఎల్ మొదలయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ ఒక వారం ముందుగానే ఐపీఎల్ ను మొదలుపెట్టబోతున్నారు. అలా చేస్తే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నియమాల ప్రకారం జట్టు సభ్యులు కనీసం 14 రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉండాలి. అందుకోసమే బీసీసీఐ అధికారులు ఐపీఎల్ షెడ్యూల్ ను మరో వారం రోజులు ముందుకు జరిపినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు.

51 రోజుల టోర్నమెంట్ కావడంతో బ్రాడ్ కాస్టర్స్ కూడా ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాలు రెండేసి మ్యాచ్ లు ఉండనున్నాయి. అలా 12 రోజులు డబుల్ హెడర్లు ఉండనున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్లనున్నారు. డిసెంబర్ 3న బ్రిస్బేన్ లో మొదటి టెస్టు భారత్ ఆడనుంది. ఆగస్టు 20న ఐపీఎల్ జట్లు యుఏఈకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. నాలుగు వారాల పాటూ ప్రాక్టీస్ చేసే అవకాశం లభించనుంది.

Next Story