ఐపీఎల్‌ పై పాక్‌ క్రికెటర్ల అక్కసు.. తెరపైకి 'మంకీ గేట్' వివాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 9:00 AM GMT
ఐపీఎల్‌ పై పాక్‌ క్రికెటర్ల అక్కసు.. తెరపైకి మంకీ గేట్ వివాదం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ), క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ)పై తీవ్ర ఆరోపణలు చేశాడు. బిసిసిఐ చెప్పినట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తోందని.. క్రికెట్ బోర్డుల్లో సమానత్వం నశించిందని అన్నాడు. జియో క్రికెట్ కు షోయబ్ అక్తర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిసిసిఐ ఆర్థికంగా చాలా పవర్ ఫుల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారు చెప్పిన పని చేస్తూ ఉందన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా మంకీగేట్ వివాదాన్ని మరచిపోయిందని పాత విషయాన్ని మళ్ళీ బయటకు తీశాడు షోయబ్ అక్తర్. (2008లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన సిరీస్ లో సైమండ్స్ ను హర్భజన్ సింగ్ మంకీ అంటూ తిట్టడం పెద్ద దుమారాన్నే లేపింది)

ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మంకీ అని తిడుతూ వికెట్ తీయాలని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సిరీస్ ను మధ్యలో వదిలివేస్తామని బెదిరింపులకు దిగుతారు. నేను ఆస్ట్రేలియన్లను మీకంటూ నీతి, నియమాలు అన్నవి లేవా అని అడుగుతున్నానన్నారు. అసలు అలాంటి ఘటనలే జరగడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతోంది. కేవలం డబ్బులు వస్తే చాలా అని అడిగాడు అక్తర్. టీ20 వరల్డ్ కప్ ను కూడా వాయిదా వేశారు. ఐపీఎల్ కు ఎటువంటి నష్టం జరగకూడదు.. వరల్డ్ కప్ ఏమైపోయినా పర్వాలేదు అని అక్తర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఎటువంటి స్థానం లేకపోవడంతో ముందు నుండి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ జట్టు ఆటగాళ్లు బిసిసిఐ మీద కక్షగట్టాయి. అందుకే ఎప్పుడు చూసినా ఐపీఎల్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారన్నారు.

అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించాలనుకున్న టీ20 ప్రపంచ కప్ వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ఐసీసీ స్పష్టం చేసింది. 2021లో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరగడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లో కూడా కరోనా మహమ్మారి ప్రబలుతూ ఉండడంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేయడమే బెటర్ అని భావించింది. ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా తమ దేశంలో ఈ మెగా టోర్నీ‌ నిర్వహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

భారత్‌లో కరోనా మహమ్మారి అధికంగా ఉన్న కారణంగా ఇండియాలో మ్యాచులు నిర్వహించడానికి సాధ్యం కాదని, యూఏఈలో మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఐపీఎల్ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున్న ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించామని, సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామని, విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతుతున్నామని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరో వారం పది రోజుల్లో ఐపీఎల్‌ పాలకమండలి సమావేశం అవుతుందని, టోర్నీ షెడ్యూల్‌ గురించి చర్చించనున్నట్లు బ్రిజేష్‌ పటేల్ తెలిపారు.

Next Story