ఐపీఎల్‌ 13వ సీజన్‌.. దుబాయ్‌ లేదా శ్రీలంక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2020 7:06 PM IST
ఐపీఎల్‌ 13వ సీజన్‌.. దుబాయ్‌ లేదా శ్రీలంక

కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌కు సిద్దంగా ఉండాలంటూ రాష్ట్ర సంఘాలకు లేఖ రాయడంతో ఈ ఏడాది ఐపీఎల్‌ ఉంటుందనే వార్తలు వినిపించాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ వాయిదా పడితేనే ఐపీఎల్‌ను నిర్వహించేందుకు వీలు ఉంటుంది.

ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. దీంతో ప్రపంచకప్‌కు అతిథ్యం ఇవ్వలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సంకేతాలు ఇచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) దీనిపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ నెలలో టీ20 ప్రపంచకప్‌ పై నిర్వహణపై నిర్ణయం వెలువడనుంది. ఈ నిర్ణయం వెలువడితేనేకానీ ఐపీఎల్‌ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని బీసీసీఐలోని ఓ అధికారి అంటున్నారు.

అయితే.. భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే 6లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఐపీఎల్‌ను మరోచోట నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది బీసీసీఐ. ఈ టోర్నీని నిర్వహించడానికి శ్రీలంక, యూఏఈ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్‌లో గనుక అక్టోబర్‌ సమయానికి భారత్‌లో వైరస్‌ నియంత్రలోకి రాకపోతే విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహిస్తామని ఆ అధికారి తెలిపారు.

ఐపీఎల్‌ను ఇండియాలో నిర్వహించినా ప్రేక్షకులను ఎలాగూ స్టేడియాల్లోకి అనుమతించరు గనుక ఎక్కడ నిర్వహించిన పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు. మేమింకా వేదికను నిర్ణయించలేదు. విదేశాల్లో నిర్వహించే అవకాశమైతే ఉంది. ఎక్కువ జట్లు ఒకేసారి వచ్చి ఒకటి రెండు మైదానాల్లో ఆడే పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఆటగాళ్లు వచ్చాక సురక్షిత వాతావరణం సృష్టించాలి. అది అభిమానులు లేకుండా. దుబాయ్‌, శ్రీలంక అతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని చెప్పాయి. వైరస్‌ పరిస్థితి, లాజిస్టిక్స్‌ అవసరాలను బట్టి వేదికను నిర్ణయించాలని ఓ అధికారి తెలిపారు.

Next Story