2011 ఫైనల్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆరు గంటల విచారణ
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 11:50 AM GMTభారత జట్టు ధోని నాయకత్వంలో 2011లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తరువాత రెండో సారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక క్రీడాశాఖా మాజీ మంత్రి మహీందానంద ఆల్తుగమాగె సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలా లేవు. దీనిపై శ్రీలంక ప్రభుత్వం విచారణ ఆరంభించింది. ప్రపంచకప్ సమయంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న లంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాను లంక పోలీసులు విచారించారు. ఈ విచారణ సుమారు ఆరు గంటల పాటు సాగింది. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరో మాజీ ఆటగాడు ఉపుల్ తరంగను త్వరలో విచారిస్తామని తెలిపారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా కోరారు. అవసరం అయితే.. విచారణ కోసం భారత్‌కు వస్తామని పేర్కొన్నారు. జూన్ 15న మహీందానంద అలుత్గామాగే ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ఇందులో ఆటగాళ్ల ప్రమేయం మాత్రం లేదన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలను లంక మాజీ క్రికెటర్లు ఖండించారు. 'ఎన్నికలేమైనా ఉన్నాయా!!. మళ్లీ సర్కస్ మొదలైంది' అంటూ కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ విమర్శించారు. ఫైనల్‌లో సెంచరీ చేసిన మహేల జయవర్థనే సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ప్రస్తుతం మహీందానంద మరో శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు.
2011, ఏప్రిల్ 2న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో మహేల జయవర్దనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13×4) సెంచరీతో చెలరేగాడు. తర్వాత లక్ష్యచేధనకు దిగిన భారత జట్టులో ఓపెనర్ గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9×4) రాణించగా.. కోహ్లీ నిష్ర్కమణ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ (91 నాటౌట్ : 79 బంతుల్లో 8×4, 2×6) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో.. 48.2 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.